ఏకగ్రీవానికి ‘ట్రాఫిక్’ అడ్డు

29 May, 2015 09:55 IST|Sakshi
ఏకగ్రీవానికి ‘ట్రాఫిక్’ అడ్డు

చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు వాసులకు ట్రాఫిక్ రామస్వామి సుపరిచితమే. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వెలిసే బోర్డులు, ఫ్లెక్సీలు తదితర ప్రచార సాధనలను తొలగిం చడం ద్వారా రాష్ట్రంలో ఆయన బహుళ ప్రాచుర్యం పొందారు. అమ్మ ఫ్లెక్సీలను సైతం నిర్దాక్షణంగా తొలగించిన నేపథ్యంలో ఇటీవల ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. కోర్టు సైతం రామస్వామికి అనుకూలంగా వ్యాఖ్యానించడమేగాక పోలీసుశాఖపై అక్షింతలు వేసింది. బెయిల్‌పై బయటకు వచ్చిన రామస్వామి వచ్చీరాగానే మళ్లీ రోడ్లపైకి చేరుకుని ఫ్లెక్సీల తొలగింపులో నిమగ్నమయ్యారు.

రాజకీయాలకు అతీతంగా ఆయన చేసే సామాజిక సేవకు ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నందున పోలీసులు పలుమార్లు ఇరుకున పడుతున్నారు. ఈ రకంగా 82 ఏళ్ల వృద్ధుడైన రామస్వామి ప్రజలకు సుపరిచితుడుగా మెలుగుతున్నారు.
 
విపక్షాల సభ్యుడిని నేనే: రామస్వామి
ఆర్కేనగర్ నుంచి పోటీచేసేందుకు విపక్షాలన్నీ వెనకడుగు వేస్తున్న తరుణంలో వారందరి ఉమ్మడి అభ్యర్థిగా తాను రంగంలోకి దిగుతున్నట్లు మక్కల్ పాదుగాప్పు కళగం అధ్యక్షులు, సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి గురువారం ప్రకటించారు. టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్, డీఎంకే అధినేత కరుణానిధి, డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్, పీఎంకే అగ్రనేత డాక్టర్ రాందాస్, ఎండీఎంకే అధినేత వైగో తదితరులను కలిసి మద్దతు కోరనున్నట్లు ఆయన చెప్పారు. జయకు జైలు శిక్షతో ఖాళీ అయిన తిరుచ్చిరాపల్లి జిల్లా శ్రీరంగం నియోజకవర్గంలో ఈఏడాది ఫిబ్రవరి 13వ తేదీన జరిగిన ఉప ఎన్నికలలో సైతం రామస్వామి పోటీ చేశారు. ఆ ఎన్నికలో 1167 ఓట్లు సాధించి ఓటమిపాలయ్యారు.
 
3న కాంగ్రెస్, సీపీఎంల సమావేశం:
ఆర్కేనగర్‌లో పోటీపై నిర్ణయం తీసుకునేందుకు వచ్చేనెల 3వ తేదీన టీఎన్‌సీసీ సమావేశం అవుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ముకుల్ వాస్నిక్ ఈ సమావేశంలో పాల్గొని రాష్ట నేతల సమక్షంలో నిర్ణయం తీసుకుంటారు. అలాగే సీపీఎం సైతం ఆర్కేనగర్‌లో పోటీపై 3వ తేదీన సమావేశం కానుంది.  ఉప ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు డీఎంకే ఇప్పటికే ప్రకటించింది. ప్రధాన పార్టీలన్నీ పోటీకి సుముఖంగా లేని తరుణంలో అమ్మ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అందరూ ఆశించారు. అయితే ఎవరేమన్నా ట్రాఫిక్ రామస్వామి పోటీ నుండి తప్పుకునే అవకాశం లేదు. ఈ కారణంగా ఆర్కేనగర్ ఉప ఎన్నికలో జయకు ఏకైక ప్రత్యర్థిగా ట్రాఫిక్ రామస్వామి మరో గుర్తింపును దక్కించుకోనున్నారు.

మరిన్ని వార్తలు