పన్నుల బాదుడికి బాబు రెడీ

27 Sep, 2016 03:20 IST|Sakshi
ఏపీ పట్టణ ప్రజల నుంచి యూజర్‌ చార్జీల వసూలు

హైదరాబాద్‌: ఎన్నికల ముందు ఒక మాట... ఎన్నికలు పూర్తయ్యాక మరో మాట...  ప్రజలపై ఎలాంటి పన్నుల భారం మోపబోమని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు త్వరలోనే పట్టణ ప్రజలపై భారం మోపడానికి రంగం సిద్ధం చేశారు.

అయితే తక్షణం పన్నుల భారం వేస్తే వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు తప్పవని ఆ ప్రతిపాదనలను కొంత కాలం వాయిదా వేశారు. రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలు కాగానే పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్నుతో పాటు ఇతర మున్సిపల్‌ పన్నులు, యూజర్‌ చార్జీలను పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

ఈ నెల 22వ తేదీన జరిగిన మంత్రివర్గ సమాశం అజెండాల్లో పట్టణ స్థానిక సంస్థల్లో ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా ఆస్తి పన్నుతో పాటు ఇతర పన్నులన్నీ పెంచేందుకు వీలుగా ముసాయిదా విధానాన్ని ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం అమృత పథకం కింద రాష్ట్రంలో 31 సిటీలను గుర్తించారు. ఆ సిటీలతో పాటు పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ఆమత పథకం కింద కేంద్రం నుంచి నిధులు రావాలంటే సంస్కరణలను అమలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగానే పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్నుతో పాటు ఇతర పన్నులు పెంపునకు కేబినెట్‌ సమావేశానికి మున్సిపల్, పట్టణాభివద్ధి శాఖ ప్రతిపాదనలను చేసింది.

అయితే త్వరలో కాకినాడ, శ్రీకాకుళం, విశాఖపట్టణం, గుంటూరు, తిరుపతి, కర్నూలు కార్పొరేషన్లకు, రాజంపేట, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నందున ఇప్పుడు ఆస్తి పన్ను ఇతర పన్నులను పెంచడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయన్న భయంతో సీఎం ఆ ప్రతిపాదనలను కొంత కాలం వాయిదా వేయాలని చెప్పారు. ఎన్నికలు పూర్తి కాగానే ఆస్తి పన్నుతో పాటు ఇతర పన్నులు పెంచుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.

ఇలా ఉండగా మరో పక్క అనంతపురం, గోదావరి, నెల్లూరు, కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను కూడా ఈ నెల 22న జరిగిన మంత్రివర్గ సమావేశం అజెండాలో మున్సిపల్, పట్టణాభివద్ధి శాఖ పెట్టింది. పట్టణాభివద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ ఎన్నికల ముందు నిర్ణయం తీసుకోవడం సమజసం కాదనే అభిప్రాయం మంత్రివర్గ సమావేశంలో వ్యక్తమైంది. దీంతో వీటిపై నిర్ణయాన్ని కూడా ఎన్నికల అనంతరం తీసుకుందామని ముఖ్యమంత్రి వాయిదా వేశారు.

పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తే అన్ని రకాల పన్నులు రెట్టింపు అవుతాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలయ్యాక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటు ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి.

గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ: కాకినాడ కేంద్రంగా రాజమండ్రి–కాకినాడల్లోని  833.47 చదరపు కిలోమీటర్ల పరిధితో గోదావరి పట్టణాభివద్ధి సంస్థను ఏర్పాటు చేయనున్నారు.

అనంతపురం–హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థ: అనంతపురం కేంద్రంగా 2605 చదరపు కిలీమీటర్ల పరిధిలో అనంతపురం –హిందూపరం పట్టణాభివద్ధి సంస్థను ఏర్పాటు చేయనున్నారు.

కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ: కర్నూలు కేంద్రంగా 1656.73 చదరపు కిలో మీటర్ల పరిధిలో కర్నూలు పట్టణాభివద్ధి సంస్థను ఏర్పాటు చేయనున్నారు.

నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ: నెల్లూరు కేంద్రంగా 1644.17 చదరపు కిలో మీటర్ల పరిధిలో నెల్లూరు పట్టణాభివద్ధి సంస్థను ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు