ఫిన్ టెక్ టెక్నాలజీపై ఒప్పందం

22 Oct, 2016 17:33 IST|Sakshi
అమరావతి: ఫిన్‌టెక్ టెక్నాలజీపై ఏపీ ప్రభుత్వానికి, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (ఎంఏఎస్)కు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు విజయవాడలో ఒప్పంద పత్రాలపై ఇరువురు ప్రతినిధులు శనివారం సంతకాలు చేశారు. ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ఐటీ అడ్వయిజర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జెఏ చౌదరి, మాస్ తరపున చీఫ్ ఫిన్‌టెక్ ఆఫీసర్ సోప్నెండ్‌ మొహంతి సంతకాలు చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో ‘మాస్’ చేపట్టబోయే కార్యకలాపాలకు ఏపీ ప్రభుత్వం మానవ వనరులను సమకూర్చనుంది. సింగపూర్ మాస్ ప్రతినిధులు మాట్లాడుతూ... తమ కంపెనీ సింగపూర్‌లోని సెంట్రల్ బ్యాంక్, ఫైనాన్సియల్ రెగ్యులేటరీ అథారిటీగా ఉందన్నారు. విశాఖపట్టణాన్ని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తామన్నారు. ఐటీకి విశాఖ అనుకూలమైన ప్రాంతమన్నారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... ఇదోక మంచి ఒప్పందమన్నారు. రాష్ట్రానికి చెందిన సమాచారాన్ని భవిష్యత్తులో ఎవ్వరూ దొంగిలించకుండా చూసుకునే టెక్నాలజీని ఈ ప్రాజెక్టు ద్వారా తయారు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి సతీష్‌చంద్ర, ఐటీ, ఇన్నోవేషన్ స్పెషల్ రెప్రజెంటేటివ్ లతఅయ్యర్‌లు పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు