ఈవోకు మంత్రి భార్య వేధింపులు

7 Dec, 2016 13:03 IST|Sakshi
ఈవోకు మంత్రి భార్య వేధింపులు
ఆలయ సిబ్బంది ఎదుట శ్రీకాళహస్తి
ఈవోపై విరుచుకుపడ్డ మంత్రి సతీమణి 
మనస్తాపానికి గురై సెలవుపై వెళ్లే యోచనలో ఈవో భ్రమరాంబ
 
శ్రీ కాళహస్తీశ్వరాలయ ఈవో భ్రమరాంబపై మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి మరోసారి అక్కసు ప్రదర్శించారు. బదిలీపై వెళ్లిపోండంటూ తీవ్రస్థాయిలో హుకుం జారీచేశారని తెలిసింది. సోమవారం ఆలయ పరిపాలన భవనానికి వచ్చిన మంత్రి సతీమణి బృందమ్మ ఈవో భ్రమరాంబపై తీవ్రస్థాయిలో మండిపడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో ఈవో తీవ్ర మనస్తాపానికి గురై సెలవుపై వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
 
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి స్థానిక టీడీపీ నాయకులు చెప్పినట్లు నడుచుకోలేదని మంత్రి సతీమణి ఈవోపై వేధింపులకు దిగారని తెలిసింది. గత ఏడాది అక్టోబర్‌ 8 వతేదీన భ్రమరాంబ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. అతి తక్కువ సమయంలోనే పాలనాదక్షతను ప్రదర్శించి గత ఏడాది బ్రహ్మోత్సవాలను వైభవంగా జరిపించి సామాన్య భక్తుల ప్రశంసలు అందుకున్నారు. అయితే అప్పటికే ఆలయంలో నిత్యం తనిఖీలు చేపడుతూ అధికారులు, సిబ్బందిని హడలెత్తిస్తున్న మంత్రి సతీమణి బృందమ్మ పెత్తనానికి అడ్డుకట్ట వేశారు. ‘‘ఆలయంలో పాలనావైఫల్యాలపై మాకు సూచనలివ్వండి గానీ మీరే స్వయంగా తనిఖీలు చేయవద్దు ’’ అంటూ మంత్రి సతీమణికి ఈవో స్పష్టం చేశారు. దీంతో అప్పటినుంచి ఆలయ పాలనలో మంత్రి సతీమణి పెత్తనానికి బ్రేక్‌ పడినట్లయింది. మాస్టర్‌ప్లాన్ లో టీడీపీ నేతలకు అనుకూలంగా ఈవో వ్యవహరించలేదని అక్కసుతోనే పరోక్ష వేధింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆలయానికి వచ్చిన బృందమ్మ  చైర్మన్ చాంబర్‌కు ఈవోను పిలిపించుకుని బోర్డు సభ్యులు, ఆలయ సిబ్బంది ఎదుటే ఆమెను తీవ్రస్థాయిలో మందలించారని సమాచారం. ‘‘మీరు స్వచ్ఛందంగా బదిలీపై వెళ్లకుంటే మేమే బలవంతంగా సాగనంపుతాం’’  అంటూ బెదిరింపుల పర్వానికి దిగారని తెలిసింది. దీని వెనుక తమ అనుయాయుల స్వప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో ఉన్న ఓ టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన అతిథిగృహాలు గాలిగోపురానికి అతి సమీపంలో ఉండటం, మాస్టర్‌ప్లాన్ లో దానిని మినహాయించడానికి ఈవో ససేమిరా అనడంతోనే పరోక్షంగా ఈవోను టార్గెట్‌ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనధికార వ్యక్తుల పెత్తనంపై విసిగిపోయిన ఈవో భ్రమరాంబ సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలిసింది.
 
ఆలయంలో ఓవైపు పెద్దఎత్తున మాస్టర్‌ప్లాన్ పనులు జరుగుతున్నాయి. జనవరి ఆరో తేదీ నుంచి మహాకుంభాభిషేకం, ఫిబ్రవరిలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ పరిస్థితుల్లో ఆలయ కార్యనిర్వహణాధికారిపై మంత్రి సతీమణి ఆధిపత్యం చెలాయించేందుకు అనధికారిక హోదాలో కర్రపెత్తనం చేస్తున్నారు. ఆలయ పెద్దలపై ఆమె అజమాయిషీని ప్రదర్శించడం పట్ల పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ అధికారిక హోదాలో ఆమె ఆలయ పరిపాలనలో జోక్యం చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. 
 
శ్రీకాళహస్తిలో కూడా మంత్రి కుటుంబీకుల ఆగడాలు శ్రుతిమించాయని పట్టణంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ తాజా సంఘటన అధికారులలో గుబులు రేపుతోంది. పవిత్ర పుణ్యక్షేత్రంలో నిర్వహించే మహత్కార్యాలను సమిష్టిగా సమన్వయంతో నిర్వహించాల్సిన తరుణం సమీపిస్తున్న వేళ ఈవోపై ఆలయంతో ఏమాత్రం సంబంధం లేని మంత్రి సతీమణి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. 
 
మరిన్ని వార్తలు