ఆంధ్రాపై నిప్పులు

9 Aug, 2016 03:08 IST|Sakshi
ఆంధ్రాపై నిప్పులు

సాక్షి ప్రతినిధి, చెన్నై:  ఎర్రచందనం దుంగలను నరికారనే ఆరోపణలతో గత ఏడాది 20 మంది తమిళ కూలీలను తిరుపతి శేషాచలం కొండల్లో ఎన్‌కౌంటర్ చేసి హతమార్చడం, తమిళనాడు నుంచి తిరుపతికి బస్సులో వెళుతున్న 288 మందిని అరెస్ట్ చేసి జైళ్లకు పంపారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా న్యాయవాదులను పెట్టి వారిని విడిపించింది. ఇదిలా ఉండగా ఈ నెల 4వ తేదీన గరుడాద్రి ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై నుంచి తిరుపతికి వెళుతున్న 32 మంది తమిళ కూలీలను ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని అధికార అన్నాడీఎంకే, ప్రధాన  ప్రతిపక్షం డీఎంకే తీవ్రంగా తప్పుబట్టింది.
 
 గతంలోని దుందుడుకు చర్యలకు కొనసాగింపుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ ఏడాది మరో 32 మంది తమిళ కూలీలపై గురిపెట్టారంటూ పార్టీలకు అతీతంగా దుమ్మెత్తిపోస్తున్నారు. తమిళ కూలీలను విడుదల చే యాలంటూ ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి వేర్వేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉత్తరాలు రాశారు. ఇతర పార్టీల నేతలూ వారితో గొంతుకలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పె రిగింది. కూలీలు అరెస్టయి ఐదు రోజులు గడిచినా సీ ఎం ఉత్తరంపై చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం మిన్నంటింది.
 
 మంత్రి గంటా పరుగు
 చంద్రబాబు ప్రభుత్వంపై ఎంతో ఆగ్రహంతో ఉన్న త మిళ ప్రజలకు ఏపీ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు దొరకడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. కృష్ణ పుష్కరాలకు ఏపీ ప్రభుత్వం తరఫున డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని ఆహ్వానించేందుకు మంత్రి గంటా సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రి రాకను ముందుగానే తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆయన్ను చుట్టుముట్టారు. 32 మంది తమిళ కూలీలను ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడంపై అభిప్రాయాన్ని చెప్పాలని ప్రశ్నించారు.
 
 ‘ఏమిటీ.. ఎర్రచందనం స్మగ్లింగ్ కూలీల గురించా అడుగుతున్నారు’ అంటూ ఆయన ఎదురు ప్రశ్న వేశారు. అవునని చెప్పిన మీడియా మంత్రి సమాధానం కోసం ఎదురుచూసింది. అయితే అన్నీ విన్న మంత్రి గంటా ‘అది నా శాఖకు సంబంధించిన వ్యవహారం కాదు, నేనేమీ చెప్పలేను’ అని నింపాదిగా సమాధానం ఇచి వెళ్లిపోయేందుకు కదిలారు. అయితే మంత్రిని చుట్టుముట్టిన ప్రజలు, మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు.
 
 పాలారు నదిలో చెక్‌డ్యాం ఎత్తు పెంపుతో తమిళ రైతులను బాధిస్తున్నారు కదా అని ప్రశ్నించగా, ఇలాంటి ప్రశ్నలు నన్ను అడగవద్దు అంటూ మీడియాను వదిలించుకుని పరుగులాంటి నడకతో కారులో కూర్చుని తుర్రున జారుకున్నారు. గోపాలపురంలో కరుణానిధిని కలుసుకుని ఆహ్వానపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కరుణానిధి సైతం తమిళ కూలీల అరెస్ట్, పాలారు జలాశయంలో చెక్‌డ్యాం ఎత్తు పెంపు అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. కరుణను గంటా కలుసుకున్నపుడు డీఎంకే ప్రతిపక్ష నేత స్టాలిన్ కూడా ఉన్నారు.
 
 చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తమిళ కూలీల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తూ తమిళర్ మున్నేట్రపడై నేతలు సోమవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. పాలారు జలాశయంలో చెక్‌డ్యాంల ఎత్తు పెంచడం ద్వారా రైతన్నలకు ద్రోహం చేసిన చంద్రబాబు దైవదర్శనానికి వస్తున్న తమిళ కూలీలపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టాడని దుయ్యబట్టారు.
 
 చెన్నై కోయంబేడు బస్‌స్టేషన్ సమీపంలో సుమారు 25 మందికి పైగా నేతలు, కార్యకర్తలు ఆందోళన జరిపారు. ఏపీ బస్సులను ముట్టడిస్తామని ముందుగా ప్రకటించడంతో బస్‌స్టేషన్ చుట్టూరా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మను తగులబెట్టారు. కోయంబేడు పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి సాయంత్రం విడిచిపెట్టారు.
 

>
మరిన్ని వార్తలు