తేలని జల జగడం

22 Sep, 2016 02:39 IST|Sakshi
తేలని జల జగడం

అసంపూర్తిగానే ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం
ప్రాజెక్టులపై తెలంగాణ, ఏపీ పరస్పర ఫిర్యాదులు
కేంద్రం మౌనం... కలిసిపరిష్కరించుకోవాలని హితవు

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాల జగడం ఎటూ తేలలేదు. ఇరువురు సీఎంలతో కేంద్రం ఆధ్వర్యంలో తొలిసారిగా జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ పంచాయితీ తెగలేదు. వివాదాస్పద ప్రాజెక్టుల వ్యవహారంలో రెండు తెలుగు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, స్పందనలు, ప్రతిస్పందనలు విన్న కేంద్రం మౌనం దాల్చింది. పరిష్కార భారాన్ని తిరిగి రెండు రాష్ట్రాలపైనే మోపింది. సరైన ప్రణాళిక లేకుండా కేవలం రాజకీయ కోణంలో హడావుడిగా ప్రాజెక్టులు నిర్మించడమే వివాదానికి కారణమైందనే భావనతో, ఇందులో తలదూర్చరాదని కేంద్రం యోచిస్తున్నట్టు సమావేశ ఫలితం స్పష్టం చేస్తోంది.

అపెక్స్ కౌన్సిల్ భేటీకి మూల కారణమైన పాలమూరు, డిండి ప్రాజెక్టుల వివాదంపై పరిష్కారం రాలేదు. అయితే... ఈ ప్రాజెక్టులు కొత్తవి కావని, టీడీపీ, బీజేపీల 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉన్నవేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై ఏపీ వాదనను వీడియో, డాక్యుమెంటరీ సాక్ష్యాలతో తిప్పికొట్టింది. తెలంగాణ వాదనను ఏపీ సీఎం చంద్రబాబు గట్టిగా కాదనలేకపోయినట్టు తెలుస్తోంది. ‘‘పోలవరం ప్రాజెక్టును కూడా 11వ షెడ్యూలులో పేర్కొనలేదు. మరి దాన్ని కూడా కొత్త ప్రాజెక్టు కింద జమ కడతారా?’’ అని ఒక దశలో కేసీఆర్ ప్రశ్నించగా, అందులో పేర్కొన్న వాటినే నిర్మాణంలోని ప్రాజెక్టులుగా పరిగణించజాలమని బాబు బదులిచ్చినట్టు తెలుస్తోంది. ‘‘పాలమూరు, డిండి ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తాం. సాగునీటి సౌకర్యం లేని మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు న్యాయం చేస్తాం’’ అని భేటీలో కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్టు సమాచారం.

పాలమూరు, డిండి ప్రాజెక్టులపై దాఖలైన పిటిషన్‌ను గతంలో విచారించిన సుప్రీంకోర్టు, దీనిపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించడం తెలిసిందే. దానితోపాటు గోదావరి జలాలను కృష్ణా పరివాహక ప్రాంతానికి మళ్లించిన నీటి నుంచి వాటాల కేటాయింపుకు ప్రాతిపదిక, నియమాల రూపకల్పన తదితర ఐదు అంశాలను అజెండాలో చేర్చి కేంద్రం అపెక్స్ కౌన్సిల్ భేటీని ఏర్పాటు చేసింది. అపెక్స్ కౌన్సిల్ ఛైర్మన్ ఉమాభారతి అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం ఇక్కడి శ్రమశక్తి భవన్‌లో కౌన్సిల్ సభ్యులైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్‌తో పాటు ఇరు రాష్ట్రాల సాగునీటి మంత్రులు హరీశ్‌రావు, దేవినేని ఉమ, కేంద్ర జల వనరులు, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు, కృష్ణా యాజమాన్య బోర్డు ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. తొలుత ఉమాభారతి 10 నిమిషాల పాటు స్వాగతోపన్యాసం చేశారు. తర్వాత ఏపీ, తెలంగాణ నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్ కుమార్, ఎస్.కె.జోషి ప్రజెంటేషన్లు ఇచ్చారు.

తరవాత అజెండా అంశాలపై 45 నిమిషాలు చర్చ జరిగింది. అనంతరం బాబు 10 నిమిషాలు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని అతిక్రమించి నిర్మిస్తున్న ప్రాజెక్టుల కారణంగా తాము నష్టపోతున్నామన్నారు. తర్వాత మాట్లాడిన సీఎం కేసీఆర్... డిండి, పాలమూరు ప్రాజెక్టులు కొత్తవి కావని పునరుద్ఘాటించారు. అవి టీడీపీ, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. ‘‘అమలులో ఉన్న ప్రాజెక్టుల జాబితాను విభజన చట్టంలో సక్రమంగా పొందుపరచలేదు. ఇలాగైతే ఏపీలోని అనేక ప్రాజెక్టులు కూడా ఆగిపోవాల్సి ఉంటుంది’’ అంటూ ఏపీ వాదనను తిప్పికొట్టారు.

మీరు అతిక్రమించారు.. లేదు.. లేదు..
విభజన చట్టాన్ని అతిక్రమించి పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను తెలంగాణ చేపట్టిందని, దాంతోతాము భారీగా నష్టపోతామని భేటీలో ఏపీ ఫిర్యాదు చేసింది. విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో ఈ ప్రాజెక్టులు లేవంది. దీన్ని తిప్పికొడుతూ అన్ని ఆధారాలనూ రాష్ట్ర ప్రభుత్వం సమావేశం ముందుంచింది. పాలమూరుకు 2013లో, డిండి ఎత్తిపోతలకు 2007లోనే పాలన అనుమతులు లభించాయని వివరించింది. ‘‘టీడీపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని పొందుపరిచింది.

మహబూబ్‌నగర్‌లో చంద్రబాబు సమక్షంలో నరేంద్ర మోదీ అప్పట్లో స్వయంగా ఈ ప్రాజెక్టుపై మాట్లాడారంటూ సదరు వీడియోను ప్రదర్శించింది. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలనూ చదివి విన్పించింది. ఏపీ వాదనలు పూర్తిగా తప్పు. ఆధారరహితం. కాబట్టి వాటిని అపెక్స్ కౌన్సిల్ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు’’ అని వాదించింది. కేసీఆర్ జోక్యం చేసుకుంటూ, విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా అమల్లోని ప్రాజెక్టుల జాబితా అసంపూర్తిగా ఉందని గుర్తు చేశారు. ఏపీలోని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తాడిపూడి, పుష్కర, ఎస్సార్బీసీ, ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర పథకాలు కూడా అందులో లేని విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.

మీరు మళ్లించారు..                              
మీరు కూడా మళ్లించారు..

ఏపీ ప్రభుత్వం మిగులు జలాల ప్రాతిపదికన పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని మళ్లిస్తోందని, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 45 టీఎంసీల వాటా తమకు చెందుతుందని తెలంగాణ వాదించింది. నికర జలాల ప్రాతిపదికన గోదావరి నుంచి పోలవరం ద్వారా ఏపీ 80 టీఎంసీలు మళ్లిస్తున్నందున మరో 45 టీఎంసీల వాటా తమకు చెందుతుందని పునరుద్ఘాటించింది. అందులోంచి ఏపీ, తెలంగాణ పంచుకోవాలని, వాటాలే తేల్చాల్సి ఉందని ఏపీ చేసిన వాదనను తిప్పికొట్టింది. సాగర్ ఎగువన తామే ఉన్నందున 45 టీఎంసీలూ తమకే చెందుతాయని వాదించింది.

 ఏపీ కొత్త వాదన
అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఏపీ కొత్తగా మరో అంశాన్ని తెర పైకి తెచ్చింది. దాదాపు 211 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్ ప్రాజెక్టులైన హైదరాబాద్ తాగునీటి పథకం, ఎస్సారెస్పీ స్టేజ్-1, 2, ప్రాణహిత-చేవెళ్ల, దే వాదుల, ఇందిరమ్మ వరద కాలువ, సీతారామ పథకాలకు 211 టీఎంసీలను తెలంగాణ మళ్లిస్తోందని ఫిర్యాదు చేసింది. ఈ 211 టీఎంసీల నీటి నుంచి తమకు వాటా రావాలని వాదించింది. తెలంగాణ డిమాండ్ మేరకు నిపుణుల కమిటీ పునర్ వ్యవస్థీకరణకు కేంద్రం సుముఖత కనబరిచినట్టు సమాచారం.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిని నోటిఫై చేయాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేయగా, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తుది కేటాయింపులు చేయకుండా నోటిఫై చేయడం కుదరదని తెలంగాణ వాదించింది. ఆలోగా ఉభయ రాష్ట్రాల ప్రాజెక్టుల నీటి పంపకాలను జాయింట్ కమిటీ పర్యవేక్షించాలని నిర్ణయించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల హెడ్‌రెగ్యులేటర్లను ఎవరి భూభాగంలో ఉన్నవి ఆ రాష్ట్రమే నిర్వహించాలని ఏపీ డిమాండ్ చేయగా.. జాయింట్ కమిటీ వేస్తే నీటి పంపిణీ సమయంలో ఒక రాష్ట్ర ఇంజినీర్ మరో రాష్ట్రానికి వెళ్లి పర్యవేక్షించుకునే వెసులుబాటు కల్పించాలని తెలంగాణ కోరింది. అందుకు కేంద్రం సమ్మతించింది.

నొప్పించక... తానొవ్వక... తటస్థంగా వ్యవహరించిన కేంద్రం
వివాదాలకు సంబంధించిన కీలకాంశాల్లో ఇరు రాష్ట్రాల్లో ఎవరినీ సమర్థించకుండా, ఎవరినీ నొప్పించకుండా భేటీలో కేంద్రం ఆచితూచి వ్యవహరించింది. రెండు రాష్ట్రాలు సరైన ప్రణాళిక లేకుండా, ఓట్ల రాజకీయాల కోణంలో హడావుడిగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడమే సమస్యలకు కారణమని కేంద్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో ఉమాభారతి అభిప్రాయపడ్డట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఏపీ ఆరోపించినట్టుగా డిండి, పాలమూరు కొత్త ప్రాజెక్టులు కావని, పాతవేనని తెలంగాణ నిరూపించగలగడం, ఆ వాదనను బాబు సమర్థంగా తిప్పికొట్టలేకపోవడంతో ఆమె కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. అందుకే వివాదాస్పద అం శాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడుతూ, పరిష్కార బాధ్యతను రెండు రాష్ట్రాల నెత్తినే పెట్టినట్టు తెలిసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్-ఒడిషా, తమిళనాడు-కర్ణాటక మధ్యా తరచూ జల వివాదాలు తలెత్తుతున్నందున జాతీయ జల విధానం రూపొందించాలని జల వనరుల శాఖ యోచిస్తోంది. ముగ్గురు ఉన్నతాధికారులకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.

చర్చల ద్వారా పరిష్కరించుకోండి
నీటి వివాదాలపై ఇద్దరు సీఎంలు తమ ప్రసంగాల్లో ఇలా కొట్లాడుకోవడం తగదని ఉమాభారతి అన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినరాదని ఆకాంక్షించినట్టు సమాచారం. ఇరు రాష్ట్రాలు పరస్పర అవగాహన, అంగీకారంతో పరిష్కార మార్గం వెతకాలని సూచించారు. అజెండాలోని మిగతా అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘సమావేశం ఫలప్రదమైంది. శాంతియుతంగా, సంతోషకరమైన వాతావరణంలో జరిగింది..’ అంటూ కుదిరిన ఏకాభిప్రాయాలను వివరించారు. ‘‘నీటి విని యోగం లెక్కలు తేల్చేందుకు టెలీ మెట్రీ విధా నం అమలుకు ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి.

ఇందుకు త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నాం. నదీ జలాల లభ్యత, పంపిణీపై అధ్యయనానికి కేంద్ర జల సంఘం, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇంజనీర్ల సంయుక్త కమిటీ ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. నీటి లభ్యత, పంపిణీపై కమిటీ అధ్యయనం చేసి కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-2)కు నివేదిక ఇస్తుంది. కేటాయింపుల సమస్యను త్వరగా పరిష్కరించాల్సిందిగా ట్రిబ్యునల్‌ను కేంద్రం కోరుతుంది’’ అని ఆమె వివరించారు. అప్పటిదాకా ప్రస్తుతం తాత్కాలిక అవగాహనతో ఏర్పాటు చేసుకున్న నీటి యాజమాన్య ఒప్పందం అమలులో ఉంటుందని కేంద్ర వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు