కలామ్ పార్టీ!

1 Mar, 2016 03:41 IST|Sakshi
కలామ్ పార్టీ!

చెన్నై, సాక్షి ప్రతినిధి: దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌కలామ్ పేరుతో పార్టీ వెలిసింది. ‘ అబ్దుల్‌కలాం విజన్ ఇండియా పార్టీ’ పేరున కలాం సలాహాదారుడైన పొన్‌రాజ్ పార్టీని స్థాపించారు. అయితే పార్టీ ఏర్పాటుపై కలాం బంధువులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
 భారత రాష్ట్రపతుల వరసలో ప్రత్యేక స్థానాన్ని పొందిన అబ్దుల్ కలామ్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఐదేళ్లపాటు భారత రాష్ట్రపతి హోదాలో అనేక రాజకీయ పార్టీలతో మెలిగినా ప్రత్యేకమైన శైలిని చాటుకునేవారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి అన్ని పార్టీల నేతలను ఆకట్టుకున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అబ్దుల్‌కలామ్‌ను ఇష్టపడుతారు.

అంతరీక్ష శాస్త్రవేత్తగా మేధావులను, తత్వవేత్తగా యువతను, భావి భారత పౌరులకు మార్గదర్శిగా విద్యార్థిలోకాన్ని ఆలరించారు. విద్యార్థిలోకమైతే అబ్దుల్‌కలామ్‌ను అపురూపమైన వ్యక్తిగా ఆరాధిస్తారు. నేటి యువతను మేల్కొలుపుతూ, ఉత్తేజపరుస్తూ కలామ్ ఇచ్చిన సందే శాలు అన్నీఇన్నీ అని లెక్కకట్టలేం. విద్యార్థిలోకంతోనే చివరి వరకు గడపాలని అబ్దుల్ కలామ్ ఆశించారు. ఆయన ఆశించినట్లుగానే మేఘాలయా రాష్ట్రం షిల్లాంగ్‌లో గత ఏడాది జూలై 27వ తేదీన విద్యార్థుల నుద్దేశించి ప్రసంగిస్తూ తుదిశ్వాస విడిచారు.

కలామ్ మృతి వార్తతో యావత్‌ప్రపంచం కదిలిపోయి కన్నీరుపెట్టింది. తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన వ్యక్తి కావడంతో రాష్ట్ర ప్రజలంతా విషాదంలో మునిగిపోయారు. చిన్నారులు సైతం టీవీల ముందు కూర్చుని ఆయన అంత్యక్రియలను అశ్రునయనాలతో తిలకించారు. రామేశ్వరంలో అబ్దుల్‌కలామ్‌కు అంత్యక్రియలు జరిగినచోట స్మారక మండపం నిర్మించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
 
కలామ్‌పేరుతో రాజకీయ పార్టీ : అబ్దుల్‌కలామ్ గతించి ఇంకా ఏడాది కూడా కాక మునేపే ఆయన పేరుతో పార్టీ ఆవిర్భావం కావడం సంచలన వార్తగా మారింది. కలామ్ సలహాదారుగా వ్యవహరించిన పొన్‌రాజ్ ‘అబ్దుల్ కలామ్ విషన్ ఇండియా పార్టీ’ అనే పేరున పార్టీని స్థాపించారు. సదరు పొన్‌రాజ్ ఆదివారం ఉదయం రామేశ్వరానికి వచ్చిన కలామ్ అంత్యక్రియలు నిర్వహించిన చోట నివాళులర్పించారు. అదే ప్రాంగణంలో ఉన్న వేదికపైకి వెళ్లి పార్టీ బోర్డును ఆవిష్కరించారు.

ఆ తరువాత కలామ్ సోదరుడు మహ్మమద్ ముత్తుమీర ఇంటికి వెళ్లి ఆశీర్వాదం పొందేందుకు ప్రయత్నించారు. అయితే ముత్తుమీరను కలిసే అవకాశం దక్కక పోవడంతో కొందరు బంధువులను మాత్రం కలిశారు. కలామ్ పేరుకు కళంకం ఏర్పడకుండా వ్యవహరించాలని పొన్‌రాజ్‌కు బంధువులు సూచించారని తెలిసింది.

పార్టీ ఏర్పాటుపై ముత్తుమీర వ్యాఖ్యానిస్తూ, తన సోదరుడు పార్టీలకు అతీతమైన వ్యక్తి, అతని ఫొటోను పెట్టుకుని రాజకీయం చేయడం బాధాకరమని అన్నారు. కలామ్ మనుమడు షేక్ సలీమ్ మాట్లాడుతూ, తమ తాత పేరుతో పార్టీ నెలకొల్పడం ఆయన వ్యక్తిగత అభీష్టమని, ఇందులో కలామ్ బంధువులకు ఎవ్వరికీ సంబంధం లేదని స్పష్టం చేశారు. కలామ్ ఎప్పుడు రాజకీయల పట్ల ఆసక్తి చూపేవారు కాదని అన్నారు.

మరిన్ని వార్తలు