లంకపై ఆగ్రహం

3 Aug, 2014 01:44 IST|Sakshi

 చెన్నై, సాక్షి ప్రతినిధి:  మత్స్యకారుల సమస్యపై తమిళనాడు, శ్రీలంకల మధ్య నెలకొన్న వైరం ఈనాటికి కాదు. భారత్ స్వాధీనంలో ఉన్న కచ్చదీవులను 1974-76ల మధ్య శ్రీలంకకు అప్పగిస్తూ చేసుకున్న ఒప్పందం తరువాత నుంచి అగ్గిరాజుకుంటూనే ఉంది. చేపల వేటకు కచ్చదీవుల వైపు వెళ్లే తమిళ జాలర్లు శ్రీలంక దాష్టీకానికి గురవుతూనే ఉన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన జయలలిత ఈ అంశంపై నిన్నటి ప్రధాని మన్మోహన్‌సింగ్ నుంచి నేటి ప్రధాని నరేంద్రమోడీ వరకు ఎన్నో లేఖలు రాశారు. ప్రస్తుతం శ్రీలంక జైళ్లలో కొందరు తమిళ జాలర్లు మగ్గుతున్నారు.
 
 వీరి పడవలు సైతం స్వాధీనం చేసుకుని ఉన్నారు. రామనాథపురం, జగదాపట్టినం, పుదుక్కొట్టై తదితర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు సమ్మె చేస్తున్నారు. సమ్మెలో భాగంగా తమ మరపడవలకు తెల్లజెండాలు కట్టుకుని ఈ నెల 2వ తేదీన కచ్చదీవులకు పయనమవుతామని హెచ్చరిం చారు. ఈ నేపథ్యంలో తమిళ జాలర్ల సమస్యలపై ప్రధాని నరేంద్రమోడీకి సీఎం జయలలిత రాసిన లేఖలను ప్రేమలేఖలుగా అభివర్ణిస్తూ శ్రీలంక ఆర్మీ తన అధికార వెబ్‌సైట్‌లో కార్టూన్ చిత్రం కూడా పొందుపరచడం వివాదానికి దారితీసింది. రాష్ట్రంలోని అనేక రాజకీయ పార్టీలు అమ్మకు దన్నుగా నిలిచి నిరసన వ్యక్తం చేశాయి. మద్రాసు రవాణాశాఖ ఉద్యోగులు, కార్మికులు సెంట్రల్ సమీపంలోని బస్‌డిపో వద్ద శుక్రవారం రాత్రి నిరసన తెలిపారు. శ్రీలంక అధ్యక్షులు రాజపక్సే దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
 ఆత్మహత్యాయత్నం
 జయలలిత వీరాభిమాని, సేలం అన్నాడీఎంకే మహిళా విభాగ సహాయ కార్యదర్శి విజయలక్ష్మి (52) ఆత్మహత్యానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి 10కి పైగా నిద్రమాత్రలు మింగారు. ఆమె కుమారుడు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె సేలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
 జాతికే అవమానం : జయ
 భారత ప్రధాని, తమిళనాడు ముఖ్యమంత్రులను కించపరుస్తూ  శ్రీలంక ఆర్మీ వెబ్‌సైట్‌లో అటువంటి వ్యాఖ్యలు, బొమ్మలు రావడం మొత్తం జాతికే అవమానంగా భావించాలని ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. శనివారం ప్రధానికి మరో లేఖ రాశారు. ప్రజాస్వామ్య పరంగా ఒక సమస్య పరిష్కారం కోసం పీఎంకు సీఎం లేఖ రాయడాన్ని వక్రీకరించడం ఆ దేశ అల్పతనానికి నిదర్శనమన్నారు. జాలర్ల జీవనాధారాన్ని కాపాడటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం, ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించే క్రమంలో శ్రీలంక ఇటువంటి చేష్టలకు దిగడాన్ని మొత్తం భారత దేశాన్ని అవమానించినట్లుగా పరిగణించాలని ఆమె కోరారు. 65 ఏళ్ల మహిళా సీఎం పట్ల అపహాస్యమా..అని ఆమె మండిపడ్డారు. భారత్‌లోని శ్రీలంక రాయబారికి ఈ విషయంపై ఖండనలు పంపాలని, బహిరంగ క్షమాపణకు డిమాండ్ చేయాలని తాజా లేఖలో ప్రధానిని ముఖ్యమంత్రి జయలలిత  కోరారు.
 

మరిన్ని వార్తలు