గడ్కారీ పరువు నష్టం దావా కేసు ఆఖరికి ఓకే

27 May, 2014 22:05 IST|Sakshi

 సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేత నితిన్ గడ్కారీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు. పాటియాలా కోర్టులో పదివేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో కూడిన బెయిల్ బాండ్‌ను సమర్పించేందుకు నిరాకరించి జైల్లో ఉన్న కేజ్రీవాల్ చివరకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలకు తలొగ్గారు. మళ్లీ కింది కోర్టులో బెయిల్ బాండ్ సమర్పించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.కాగా, నితిన్ గడ్కారీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో రూ.పది వేల వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చేందుకు కేజ్రీవాల్ నిరాకరించడంతో జూన్ ఆరు వరకు దిగువ కోర్టు పోలీసు కస్టడీకి తరలించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ  కేజ్రీవాల్  సోమవారం హైకోర్టుకు వెళ్లారు.
 
  తనను వెంటనే జైలు నుంచి విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని, చట్టవిరుద్ధంగా కారాగారానికి పంపారని సదరు హెబియస్ కార్పస్ పిటిషన్‌లో కేజ్రీవాల్ పేర్కొన్నారు.  ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు కైలాష్ గంభీర్, సునీతా గుప్తాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. కేజ్రీవాల్‌ను జైలు నుంచి విడుదల చేసేలా కింది కోర్టును ఆదేశించలేమని చెప్పింది. బెయిల్ బాండ్ చెల్లించేలా  కేజ్రీవాల్‌కు సలహా ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్‌ను ఆదేశించింది. బెయిల్ బాండ్ చెల్లించాలనడాన్ని సవాల్ చెయ్యడంపై తర్వాత విచారణ చేస్తామని, ముందుగా కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రావాలంటే రూ. పదివేల పూచీకత్తుతో కూడిన బెయిల్ బాండ్ చెల్లించమనండి అని  ధర్మాసనం  పేర్కొంది. దీనిని ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిం చింది. ఆయన జైలులో ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? బెయిల్ బాండ్ చెల్లించి అతన్ని విడిపించండి.
 
  చట్టపరమైన విషయాలపై మేమే తర్వాత విచారణ చేస్తామని పేర్కొంది. తీహార్ జైలు వెలుపల కేజ్రీవాల్‌ను కలవడానికి న్యాయస్థానం ఆయన తరపు న్యాయవాదులకు అనుమతినిచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం బెయిల్ బాండ్ చెల్లించడానికి కేజ్రీవాల్ సుముఖంగా ఉన్నట్లు ప్రశాంత్ భూషణ్ ఆ తర్వాత ధర్మాసనానికి చెప్పారు. దీంతో పదివేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో కూడిన బెయిల్ బాండ్‌ను దిగువ కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం తెలిపింది. ఈ పిటిషన్‌పై మూడు వారాల్లోగా సమాధానమివ్వాలని నితిన్ గడ్కారీ, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది. అయితే ఆప్ తన కోసం ప్రత్యేక చట్టాలు కోరుకొంటోందని నితిన్ గడ్కారీ తరఫు న్యాయవాది పింకీ ఆనంద్ వాదించారు. జైలు నుంచి  కేజ్రీవాల్ మీడియాతో వ్యాఖ్యలు చేయడాన్ని అనుమతించరాదని ఆమె చెప్పారు. కేజ్రీవాల్ కోర్టు నియమాలను పాటిం చడం లేదని తెలిపారు.  
 
 మనీష్, సిసోడియాలకు నోటీసులు
 కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో న్యాయస్థానం ఆప్ నేతలు గోపాల్ రాయ్, మనీష్ సిసోడియాలకు నోటీసులు జారీచేసింది. బెయిల్ బాండ్ చెల్లించనందుకు కేజ్రీవాల్‌ను జైలుకు పంపుతూ న్యాయస్థానం జారీచేసిన ఆదేశాలపై మనీష్ సిసోడియా వ్యాఖ్యానిస్తూ అచ్చేదిన్ ఆగయే హై (మంచి రోజులొస్తాయి) అని  అన్నారు. ఏ ఆధారంతో  ఈ వ్యాఖ్య చేశారని కోర్టు ఆప్ నేతలను ప్రశ్నించింది.
 

>
మరిన్ని వార్తలు