డిస్కంల ఆడిట్‌పై సీఏజీని కలిసిన కేజ్రీవాల్

25 Feb, 2015 22:30 IST|Sakshi

 న్యూఢిల్లీ: విద్యుత్తు కంపెనీలపై ఆడిట్ స్థితిగతులను తెలుపుకోవడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ బుధవారం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సీఏజీ) శశికాంత్ శర్మను కలిశారు. ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు డిస్కంల ఆడిట్‌కు ఆదేశించిన విషయం విదితమే. ఆడిట్ కోసం కాలవ్యవధి నిర్ధారించలేదని, దీనికి అన్ని విధాల సహకరిస్తామని తాము సీఏజీకి చెప్పామని సత్యేంద్ర జైన్ తెలిపారు.
 
 డిస్కంలపై సీఏజీ ఆడిట్ ఎంతవరకు వ చ్చిందో తెలుసుకోవడంతో పాటు ఆడిట్ కోసం కావలసిన పత్రాలను డిస్కంలు సీఏజీకి అందించడం లేదని మీడియాలో వచ్చిన వార్తల్లోని నిజాలను తె లుసుకోవడానికే ముఖ్యమంత్రి.. సీఏజీని కలిశారని ఢిల్లీ సచివాలయ వర్గాలు తెలిపాయి. విద్యుత్ చార్జీలను సగానికి తగ్గిస్తామని ఆప్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఏజీ ఆడిట్ పూర్తయ్యేంత వరకు డిస్కంల చార్జీలపై కోత విధించడం సాధ్యం కాదు కనుక, సీఏజీ నివేదిక వచ్చేంతవరకు ఆప్ సర్కారు విద్యుత్తు చార్జీలపై సబ్సీడీ ఇవ్వనుంది.
 
 దీని వల్ల ప్రభుత్వంపై ఏటా రూ. 1600 కోట్ల భారం పడనుంది. దీంతో సీజీ ఆడి ట్‌ను వీలైనంత తొందరగా జరగాలని ఆప్ సర్కారు ఆశిస్తోంది. మరో వైపు కేజ్రీవాల్ సర్కారు న్యూఢిల్లీలోని డిస్కంల ఖాతాలపై 2002 నుంచి ఆడిట్ జరపాల్సిందిగా సీఏజీని ఆదేశించడం వెనుకనున్న ఔచిత్యాన్ని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రశ్నిస్తూ..  ఏ కంపెనీ అయినా ఎనిమిదేళ్ల రికార్డులను మాత్రమే కలిగి ఉంటుందన్నారు.
 

మరిన్ని వార్తలు