లా యూనివర్సిటీలో కోర్సుల రద్దుకు సిఫారసు

5 Mar, 2015 02:48 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ లా యూనివర్సిటీలోని కోర్సులను రద్దు చేయాల్సిందిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ప్యానల్‌కు లీగల్ ఎడ్యుకేషనల్ కమిటీ సిఫారసు చేసింది. రాజస్థాన్ రిటైర్డ్ జడ్జి వి.ఎస్ దేవ్ నే తృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం ఈ మేరకు నివేదికను అందించింది. ‘దేశంలో న్యాయ విద్యకు సంబంధించి ఇదే అత్యున్నత విభాగం. క్యాంపస్ లా సెంటర్ మూసి ఉండటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం.

ఇలా ఐతే విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుంది. యూనివర్సిటీకి చెడ్డ పేరు వస్తుంది’ అని తనిఖీ సందర్భంగా కమిటీ అభిప్రాయపడింది. విద్యా ప్రమాణాలు పాటించడంలో యూనివర్సిటీ అథారిటీ పూర్తిగా విఫలమైందని కమిటీ తేల్చింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ఆగస్టు నాటికి అన్నింటిని సరిదిద్దుకోవాలని సూచించింది. విశ్వవిద్యాలయం తన మూడు సెంటర్లకి అఫిలియేషన్ పొడిగించుకోవటంలో విఫలమైందని, వెంటనే అక్కడి కోర్సులను రద్దు చేయాలని తనిఖీ బృందం సూచించింది.
 
గతంలో ఢిల్లీ హైకోర్టు బీసీఐ నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు, వసతులు కల్పించాల్సిందిగా యూనివర్సిటీని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న భ వనాలు సరిపోవటం లేదని వర్సిటీ తెలిపింది. కొత్త వాటిలోకి మారాల్సి ఉందని, తరగతి గదుల కొరత ఉందని ఆ సందర్భంగా యూనివర్సిటీ హైకోర్టుకు తెలిపింది. లీగల్ కమిటీ తమ తనిఖీల ద్వారా వర్సిటీలో పర్మినెంట్ అధ్యాపకుల కొరత ఉందని, డీన్ పనితీరు కూడా సరిగా లేదని వెల్లడైనట్టు పేర్కొంది.

>
మరిన్ని వార్తలు