ఎంపీసీసీ అధ్యక్షుడిగా అశోక్ చవాన్

2 Mar, 2015 23:38 IST|Sakshi

- లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర
- కార్పొరేషన్ విజయంలోనూ ముఖ్య భూమిక
- సరైన వ్యక్తిగా భావించిన అధిష్టానం
- ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంజయ్ నిరుపం

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షునిగా మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఎంపికయ్యారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా ఏఐసీసీ మహారాష్ట్రలో పార్టీ ప్రక్షాళన చేయాలని భావిస్తున్న అధిష్టానం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఎంపీసీసీ అధ్యక్షునిగా అనేక మంది పేర్లు ముందుకు వచ్చినప్పటికీ ఇటీవలి అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరువు కాపాడిన అశోక్ చవాన్‌కు పట్టం కట్టాలని భావించింది. మరోవైపు ఉత్తర భారతీయ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ముంబై కాంగ్రెస్ అధ్యక్షునిగా కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు సంజయ్ నిరూపంను ఎంపిక చేసింది.
 
లోక్‌సభ ఎన్నికల్లో చవాన్ కీలక పాత్ర

అనేక సంవత్సరాలుగా పెట్టని కోటగా ఉన్న మహారాష్ట్ర కాంగ్రెస్‌కు ఇటీవలి ఎన్నికల్లో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హవా కొనసాగడంతో లోకసభ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. మరాఠ్వాడా, నాందేడ్ జిల్లాలో అశోక్ చవాన్‌కు ఉన్న గుర్తింపు, చేసిన అభివృద్ధి పనుల ద్వారా ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. లోకసభ ఎన్నికలకు ముందు 2012 అక్టోబరులో జరిగిన నాందేడ్ - వాఘాలా మున్సిపల్  కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన సత్తా చాటారు.

కార్పొరేషన్ అవతరించిన తర్వాత మొదటి ఎన్నికలు మినహా వరుసగా మూడు సార్లు కార్పొరేషన్ ఎన్నికల్లో  కాంగ్రెస్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చవాన్ మోదీ హవాను తట్టుకొని విజయం సాధించారు. మరో పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు.
 
చవాన్‌ను సమర్థుడిగాభావించిన అధిష్టానం
కాగా కొంత కాలంగా ఎంపీసీసీ, ముంబై రీజినల్ కాంగ్రెస్ కమిటీ (ఎమ్మార్సీసీ) ప్రక్షాళన  చేయాలని చూస్తున్న అధిష్టానం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఆదర్శ్ కుంభకోణం, పెయిడ్ న్యూస్ ఆరోపణలతో వివాదాల్లోకెక్కిన చవాన్‌కు ఎంపీసీసీ పగ్గాలు ఇవ్వడానికి తర్జనభర్జన పడిన  అధిష్టానం ఎట్టకేలకు చవాన్‌కు అధికారం అప్పగించాలని నిర్ణయించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన శంకర్‌రావ్‌చవాన్ నుంచి రాజకీయ వారసత్వం పొందిన ఆయన కుమారుడు అశోక్ చవాన్ కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఎన్సీపీ, బీజేపీ, శివసేనను ఎదుర్కొనేందుకు చవాన్ సమర్థుడని అధిష్టానం భావించింది. కాగా, ముంబై కాంగ్రెస్ అధ్యక్షునిగా సంజయ్ నిరుపంకు పార్టీ పగ్గాలు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మరాఠీ ఓటర్లు, శివసేన, ఎమ్మెన్నెస్‌ల మద్య చీలిపోయే అవకాశముండటంతో ఉత్తరభారతీయుల ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉత్తర భారతీయుడైన సంజయ్ నిరూపం సరైన వాడని భావించింది.

మరిన్ని వార్తలు