పోరుగడ్డ.. ఆసిఫాబాద్

11 Oct, 2016 11:13 IST|Sakshi
  • ఆదివాసీల ఖిల్లా.. ఈ జిల్లా
  • కొమురం భీమ్ పేరిట ఏర్పాటు
  • నిజాం కాలం నాటి ఆనవాళ్లు ఎన్నో
  •  
    జల్..జంగల్..జమీన్.. అంటూ నినదించిన గిరిజన పక్ష పోరాట యోధుడు కొమురం భీమ్ పురిటిగడ్డ ఈ ఆసిఫాబాద్. ఆయనతో పాటు మరెందనో పోరాట యోధుల జన్మస్థలాలున్నది ఈ ప్రాంతంలోనే. కెరమెరి ఘాట్ల అందాలు.. సిర్పూర్ పేపర్‌మిల్లు, హైమన్‌డార్ఫ్ దంపతుల సేవలు.. మినీ ఇండియూగా కనిపించే కాగజ్‌నగర్.. ఇక్కడి విశేషాలు. ఒకప్పుడు జిల్లా కేంద్రం ఇప్పుడు మళ్లీ జిల్లాగా..- ఆసిఫాబాద్
     
     ఆజంజాహి వంశ కాలంలో..
     హైదరాబాద్ సంస్థానాధీశుడిగా ఉన్న ఆజంజాహి వంశానికి చెందిన నిజాం నవాబు 1907లో ఈ ప్రాంతాన్ని ఆసిఫాబాద్‌గా నామకరణం చేశారు. ఈ ప్రాంతం గుండా రెబ్బెనలో ఉన్న రైల్వేస్టేషన్‌ను ఆసిఫాబాద్ రోడ్‌గా మార్చారు. 1913 నుంచి 1940 వరకు ఇది జిల్లా కేంద్రంగా ఉండేది. ఆ తరువాత జిల్లా కేంద్రం ఆదిలాబాద్ తరలిపోయినా, ఆసిఫాబాద్ మాత్రం విశిష్టతను కాపాడుకుంటూ వస్తుంది. నిజాం నాటి కార్యాలయ భవనాలు నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తాయి. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మొన్నటి వరకు నిజాం కాలం భవనంలోనే కొనసాగింది.
     
     జిల్లా ప్రత్యేకత
    జల్ జంగల్ జమీన్ కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన గోండు వీరుడు కొమరం భీమ్ వర్ధంతి ఏటా ప్రభుత్వం కెరమెరి మండలం జోడేఘాట్‌లో నిర్వహిస్తుంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యే కావడం, రాష్ట్రంలో మొదటి గిరిజన పట్టభద్రుడు కొట్నాక భీమ్‌రావు నియోజకవర్గానికి చెందిన వారు కావడం విశేషం. నిజాం మెచ్చిన గ్రామంగా పేరొందిన ఆసిఫాబాద్ ఒకప్పటి జిల్లా కేంద్రం. మొట్టమొదటి ఆర్టీసీ డిపో కూడా ఇక్కడే ఏర్పాటైంది.
     
    జైనూరు మండలం మార్లవాయిలో గిరిజనులకు సంక్షేమ ఫలాలందించిన శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ హెమండార్ఫ్ దంపతుల సమాధులున్నాయి. కెరమెరి ఘాట్లు ప్రకృతి అందాలకు కనువిందు, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పూలాజీ బాబా క్షేత్రం కూడా నియోజకవర్గంలోనే ఉంది. దీంతో పాటు పట్టణంమలోని శిర్డీ సాయి మందిరం కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది.
     
    ఆసిఫాబాద్ మండలంలో కొమురం భీమ్, వట్టివాగు, తిర్యాణిలో చెలిమెల వాగు, కాగజ్‌నగర్ నియోజకవర్గంలో జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టులున్నాయి. రెబ్బెన మండలంలోని గంగాపూర్‌లో వేంకటేశ్వర దేవాలయం, కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గాంలో శివమల్లన్న దేవాలయం, టొంకిని హనుమాన్ ఆలయం ప్రసిద్ది చెందినవి.  ఇక్కడి రైతులు రికార్డు స్థాయిలో పత్తి పండిస్తారు. దీంతో పారిశ్రామికంగా జిన్నింగు, ఆయిల్ మిల్లులు వెలిశాయి. రెబ్బెన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైల్వేస్టేషన్‌కు ఆసిఫాబాద్ రోడ్ పేరు పెట్టారు.
     
    కాగజ్‌నగర్‌లో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎస్పీఎం పేపర్ మిల్లు, సర్‌సిల్క్ మిల్లులు మూత పడ్డాయి. క్రీశ 1700 శతాబ్దంలో ఆసిఫాబాద్‌ను సుమారు 200 సంవత్సరాలు గోండు రాజులు పరిపాలించినట్లు చరిత్ర చెబుతుంది.
     
     అభివృద్ధి వైపు...
    ఆసిఫాబాద్‌ను కొమురం భీమ్ జిల్లాగా ప్రకటించడంతో ఇ క్కడి ప్రజల్లో అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి.  ఇక్కడ కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతో పాటు సుమారు 60 శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలు ఏర్పాటుతో సుమారు 2 వేలకు పైగా ఉద్యోగుల సంఖ్య పెరగనునుంది. జిల్లా కేంద్రంలో విద్య, వైద్యం, రోడ్లు,  కనీస సౌకర్యాలు లేవు.
     
    తాజాగా జిల్లా ప్రకటనతో జిల్లాలో రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థ, వైద్య సేవలు మెరుగుపడనున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆస్పత్రి 500 పడకల ఆస్పత్రిగా స్థాయి పెరిగింది. హోటళ్లు, లాడ్జిల సంఖ్య పెరగనుంది. జిల్లా ఏ ర్పాటుతో  భూముల ధరలకు రెక్కలొచ్చాయి.  అద్దె ఇళ్లకు సై తం డిమాండ్ పెరిగింది. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడ వివిధ పనుల కోసం వచ్చే ప్రజలతో వ్యాపారం గణనీయం గా అభివృద్ధి చెందుతుందే అవకాశాలున్నాయి.  
     
    బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లు నిర్మించే అవకాశాలున్నా యి. జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలతో ఆర్టీసీ బస్సుల సంఖ్య, ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి.  జిల్లాలో వ్యవసా యాభివృద్ధికి సమృద్దిగా వనరులున్నాయి.   మండలంలోని కొమురంభీమ్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా 45,500, వట్టివాగు ప్రాజెక్టు ద్వారా 24,500 ఎకరాల  ఎకరా ల ఆయకట్టుకు సాగునీరందనుంది.
     
    దీంతో పంట పొలాలు, చేలు సస్యశామలమవుతాయి. వ్యవసాయాభివృద్ధి జరుగుతుంది. జిల్లా అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరగడంతో జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్థాయి ఆస్పత్రులూ ఏర్పాటవొచ్చు. దీంతో పాటు ప్రైవేటు, ప్రభుత్వ  పాఠశాలలు, కళాశాలల సంఖ్య పెరిగి గ్రామీణ ప్రాంతంలో అక్షరాస్యత పెరిగే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు