ప్రియుడే హంతకుడు

20 Feb, 2016 09:58 IST|Sakshi
ప్రియుడే హంతకుడు

బెంగళూరు :  సాసలు క్లస్టర్ పరిధిలోని కల్లుకుంటె గ్రామ శివార్లలో ఈనెల 7వ తేదీన జరిగిన మహిళ హత్యకేసు మిస్టరీ వీడింది. తరచూ డబ్బు కోసం వేధిస్తుండటంతో  ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు తేల్చిన పోలీసులు... బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్ట క్లస్టర్ పరిధిలోని తురబన హళ్లికి చెందిన గంగాధర్(32)ను అరెస్ట్ చేశారు. డీవైఎస్పీ కోనప్పరెడ్డి కథనం మేరకు..కుణిగల్ తాలూకా బన్నికుప్పెకు చెందిన ఉషారాణి(26)కి 8 సంవత్సరాల క్రితం రాజ్‌కుమార్ అనే వ్యక్తిని వివాహమైంది. హెసరఘట్ట క్లస్టర్ పరిధిలోని తరబనహళ్లిలో గంగాధర్ అనే వ్యక్తి ఇంట్లో వీరు అద్దెకు ఉండే వారు. ఈ క్రమంలో ఉషారాణికి గంగాధర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. గంగాధర్‌కు వివాహమైన తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగింది. పసిగట్టిన గంగాధర్ భార్య భర్తతో గొడవ పడేది. మరోవైపు ఉషారాణి గంగాధర్‌ను తరచూ డబ్బులు ఇవ్వమని పీడించేది.

దీంతో విసుగుచెందిన గంగాధర్...ఉషారాణిని హత్య చేయాలని పథకం పన్నాడు. ఈనెల 7వ తేదీన ఆమెను బైక్‌పై దొడ్డబళ్లాపురం తాలూకా కల్లుకుంట గ్రామ శివార్లకు తీసుకెళ్లాడు. ప్రభుకుమార్‌కు చెందిన స్థలంలో ఆమెను వేల్‌తో గొంతు బిగించి హత్య చేశాడు.  తాళిబొట్టు, చెవి దుద్దులు తీసుకున్నాడు. వెంట తీసుకువచ్చిన పెట్రోల్ పోసి కాల్చివేసి పరారయ్యాడు.
 
ఇదిలా ఉండగా భార్య కనిపించకపోవడంతో ఉషారాణి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో కల్లుకుంటె గ్రామం శివార్లలో మహిళను పెట్రోల్ పోసి కాల్చి హత్య చేసినట్లు తెలుసుకున్న ఎస్ఐ లూయీ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి హతురాలు ఉషారాణిగా నిర్ధారించి దర్యాప్తు ముమ్మరం చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
 
 

మరిన్ని వార్తలు