జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ఇండోర్ స్టేడియంలో అసెంబ్లీ

1 Feb, 2014 02:58 IST|Sakshi

 సాక్షి,న్యూఢిల్లీ: అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం కోసం విధానసభను ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు ప్రత్యేకంగా సమావేశపరచాలని కేబినె ట్ నిర్ణయించింది. ఇందిరాగాంధీ స్టేడియంలో  ఫిబ్రవరి 16న అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లును ఆమోదిస్తామని విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. శుక్రవారం కేబినెట్ సమావేశం తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలో లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టినా, కొన్ని విభాగాలపై అభ్యంతరాలు రావడంతో ప్రస్తుతం దానిని ఆమోదించలేదని చెప్పారు. మళ్లీ సోమవారం నిర్వహించే కేబినెట్ సమావేశంలో బిల్లును ఆమోదిస్తామని ప్రకటించారు. అభ్యంతరాలేంటో సిసోడియా స్పష్టం చేయనప్పటికీ హోంశాఖ, న్యాయ విభాగాలు బిల్లుపై అభ్యంతరాలు లేవనెత్తినట్లు తెలిసింది. ఈ నెల 13 నుంచి నాలుగు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని మంత్రి చెప్పారు.
 
  ఫిబ్రవరి 16న ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే అసెంబ్లీ సమావేశంలో లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలని కేబినెట్ నిర్ణయించిందని సిసోడియా తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశానికి హాజరుకావాలని ఆయన ప్రజలను ఆహ్వానించారు. బిల్లును ఆమోదించడానికి చారిత్రక రామ్‌లీలా మైదాన్‌లో అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ గతంలోనే ప్రకటించారు. భద్రతా సమస్యల దష్ట్యా మైదాన్‌లో విధానసభను సమావేశపరచడాన్ని పోలీసులు వ్యతిరేకించారు. దాంతో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో అసెంబ్లీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ స్టేడియంలో 15 వేల మంది కూర్చోవడానికి వీలుంది. స్టేడియంలో అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతించాల్సి ఉంటుంది.
 
 బిల్లు విశేషాలివి..
 లోకాయుక్త వ్యవస్థను మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో ప్రవేశపెడుతున్న ‘ఢిల్లీ లోకాయుక్త బిల్లు 2014’ ఉత్తరాఖండ్ లోకాయుక్త బిల్లును పోలి ఉన్నా, దానికన్నా కఠినంగా ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. కొత్త బిల్లు ప్రకారం ముఖ్యమంత్రి కూడా లోకాయుక్తకు జవాబుదారీ అవుతారు. కొత్త బిల్లు ప్రకారం.. పది మంది లోకాయుక్తలకు ఒక చైర్మన్ ఉంటారు. సగం మంది సభ్యులు న్యాయవ్యవస్థకు చెందిన వారుంటారు. మిగతా సగం మంది వివిధ రంగాల నిపుణులు ఉండవచ్చు. రిటైర్డు న్యాయమూర్తులు, అధికారులతో కూడిన కమిటీ లోకాయుక్త సభ్యుల పేర్లను ప్రతిపాదిస్తుంది. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఈ పేర్లను ఖరారు చేస్తుంది. అవినీతి అధికారులను డిస్మిస్ చేయడం, డిమోట్ చేసే అధికారం లోకాయుక్తకు ఉంటుంది. నేరస్తులుగా తేలినవారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించే అధికారం ఉంటుంది. కేసుల విచారణను ఆరునెలల్లో ముగించాల్సి ఉంటుందని, ఇందుకోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు.

మరిన్ని వార్తలు