అసెంబ్లీ సమావేశాలు నడిపేందుకు ప్రభుత్వం వెనకడుగు....

25 Oct, 2014 03:22 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వాటిని చర్చించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి మండిపడ్డారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సైతం వెనకడుగు వేస్తోందని విమర్శించారు. హాసనలోని హాసనాంబ దేవాలయాన్ని శుక్రవారం సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

గృహనిర్మాణ సహకార సంఘానికి చెందిన ఇళ్ల పంపిణీలో తాను అక్రమాలకు పాల్పడ్డానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారని, ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపితే ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో తెలుస్తుందని సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో సిద్ధరామయ్య ప్రభుత్వం పూర్తిగా వెనుకబడిందని, స్పీకర్ కాగోడు తిమ్మప్ప రాష్ట్ర మంత్రివర్గ సభ్యులపై విమర్శలు చేస్తుండడమే ఇందుకు ఉదాహరణ అని కుమారస్వామి పేర్కొన్నారు.

రాష్ట్రంలో అన్నభాగ్య పధకం పూర్తిగా విఫలమైందని, అన్నభాగ్య పథకం పూర్తిగా ధనవంతులు, దళారులకు ప్రయోజనాలు చేకూరుస్తోందని విమర్శించారు. ఇక రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ అక్రమ ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. డి.కె.శివకుమార్ అద్దాల మేడలో కూర్చున్నారని, అక్రమంగా ఆస్తులను సంపాదించడంతో పాటు ఆ సంపదతో మంత్రి పదవిని కూడా పొందారని మండిపడ్డారు.

అదే సందర్భంలో దేవెగౌడ కుటుంబం అద్దాల మేడలో లేదని, వీధుల్లో సామాన్య ప్రజలతోనే వారి సమస్యలను చర్చిస్తూ ఉందని అన్నారు. జేడీఎస్‌లో 11 మంది సభ్యులతో ఒక కోర్ కమిటీని రూపొందించామని, మరో రెండు మూడు రోజుల్లో కోర్ కమిటీలోని సభ్యుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. కోర్ కమిటీని ప్రకటించిన అనంతరం జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.

ప్రస్తుతం జేడీఎస్ రాష్ట్రశాఖ అధ్యక్ష పదవి కోసం ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. అందువల్ల త్వరలోనే జేడీఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో పాటు జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడతో కలిసి సమావేశాన్ని నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు చెప్పారు.
 

మరిన్ని వార్తలు