నో ఎంట్రీ

2 Aug, 2017 02:54 IST|Sakshi

అన్నాడీఎంకే కార్యాలయంలోకి దినకరన్‌ ప్రవేశంపై నిషేధం
ఇరువర్గాల విలీనంపై ముమ్మర ప్రయత్నాలు
సీఎం ఎడపాడి అత్యవసర సమావేశంలో నిర్ణయం
డోంట్‌ కేర్‌: దినకరన్‌


 ‘మిస్టర్‌ దినకరన్‌... నో ఎంట్రీ’.
అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ కార్యాలయం
లోకి ప్రవేశించరాదంటూ దినకరన్‌పై
ఎడపాడి వర్గం నిషేధం విధించింది.


హద్దుమీరి జొరబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేసింది. చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీఎం ఎడపాడి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల కమిషన్‌ తాత్కాలికంగా నిషే«ధం విధించిన ఎంజీఆర్‌ అన్నాడీఎంకే, అదే పార్టీకి చెందిన రెండాకుల గుర్తుకు విముక్తి కలగాలంటే పార్టీలోని వర్గపోరు సమసిపోవడం తప్ప గత్యంతరం లేదు. పార్టీ పేరు, రెండాకుల చిహ్నం పన్నీర్‌ వర్గానికంటే శశికళ, ఎడపాడి వర్గాలకే ఎక్కువ అవసరంగా మారింది. అధికారంలో ఉన్నా అసలు పార్టీ లేదనే కొరవ వారిని బాధిస్తోంది.

పన్నీర్‌ సెల్వం వర్గాన్ని కలుపుకుపోవడం ద్వారా పార్టీ, చిహ్నాన్ని పొందవచ్చని భావించిన ఎడపాడి వర్గం విలీనానికి సిద్ధ్దపడింది. శశికళ కుటుంబాన్ని దూరం పెట్టడం ప్రధాన షరతుగా పన్నీర్‌ వర్గం విలీనానికి ముందుకు రాగా సరేనంటూ మంత్రి విజయకుమార్‌ ప్రకటించారు. ఎడపాడి ప్రయత్నాలు ఇలా ఉండగా,  రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్‌కు రూ.50కోట్లు ఎరవేసే ప్రయత్నంలో అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డాడు. కొన్ని నెలలపాటు తీహార్‌ జైలు ఖైదీగా మారి బెయిల్‌పై ఇటీవలే బయటకు వచ్చాడు. వచ్చీ రావడంతోనే పార్టీపై మరలా పట్టుకోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. తనతో విబేధిస్తూ పార్టీలో మరో కేంద్ర బిందువుగా మారుతున్న సమీప బంధువు దివాకరన్‌తో సంధికుదుర్చుకున్నాడు.

ఈ పరిణామాలు ఎడపాడి వర్గాన్ని కలవరపెట్టాయి. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఇరువర్గాల విలీనానికి 60 రోజులు గడువిస్తున్నా, ఇచ్చిన గడువును సద్వినియోగం చేసుకోకుంటే 61వ రోజున పార్టీ బాధ్యతల్లోకి ప్రవేశిస్తానని గతంలో దినకరన్‌ హెచ్చరించారు. అయితే ఎడపాడి, పళని వర్గాల విలీన ప్రయత్నాలు మూలపడగా, దినకరన్‌ ఇచ్చిన 60 రోజుల గడువు ఈనెల 4వ తేదీతో ముగుస్తోంది. ఇదే అదనుగా ఈనెల 5వ తేదీన పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని క్రియాశీలక పాత్రపోషిస్తానని దినకరన్‌ ఇటీవల ప్రకటించాడు.

నేను సర్వాధికారిని : దినకరన్‌
ఉప ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీపై తనకు పూర్తిస్థాయి అధికారం ఉందని, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా అడ్డుకునే హక్కు శశికళ మినహా ఎవ్వరికీ లేదని దినకరన్‌ మంగళవారం మీడియా వద్ద వ్యాఖ్యానించాడు. ఇరువర్గాల విలీనంపై తాను ఇచ్చిన 60 రోజుల గడువు దాటిపోయిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన అన్నారు. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నా పాత్ర నేను పోషిస్తాను అని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్రమంతా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని తెలిపాడు.

ఎడపాడి, పన్నీర్‌ వర్గాలు విలీనమైతే మంచిదేనని అన్నారు. ప్రభుత్వంతోపాటూ పార్టీ బాధ్యతలను సీఎం ఎడపాడే చూసుకుంటారని మంత్రి జయకుమార్‌ ప్రకటించారని ప్రశ్నించగా, జయకుమార్‌ ఎవరికో బయపడి ఆ మాటలు అని ఉంటాడు, త్వరలో అన్నీ సర్దుకుంటాయని అన్నారు.  తమ నిబంధనలు నెరవేరిస్తే విలీనం తనకు తానుగా జరిగిపోతుందని పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన మాజీ మంత్రి మాపై పాండియరాజన్‌ మంగళవారం వ్యాఖ్యానించారు. సీఎం, ప్రధాన కార్యదర్శి పదవుల కోసం పట్టుబట్టి కాలయాపన చేయకుండా పన్నీర్‌ వర్గం ముందుకు రావాలని ఒక సీనియర్‌ మంత్రి వ్యాఖ్యానించాడు. సీఎం అత్యవసర సమావేశం సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  

సీఎం అత్యవసర సమావేశం ః
దినకరన్‌ ప్రకటనతో కంగారుపడిన సీఎం ఎడపాడి పళనిస్వామి చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం అత్యవసరంగా సమావేశమైనారు. మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలతో దినకరన్‌ విషయంపై చర్చించారు. అందరి సూచనల మేరకు పార్టీ కార్యాయంలోకి దినకరన్‌ ప్రవేశించకుండా నిషే«ధం విధించినట్లుగా అనధికారిక సమాచారం. విలీనం కోసం దినకరన్‌ గతంలో ఇచ్చిన గడువును గుర్తు చేసుకుంటూ పన్నీర్‌సెల్వం వర్గంను చేరదీయాలని, షరతులు లేకుండా ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే గత ఏడాది అక్టోబరులో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఇక వాయిదా వేయకుండా నిర్వహించే అంశంపై సైతం చర్చించుకున్నారు.

మరిన్ని వార్తలు