భలే మంచిరోజు

7 Aug, 2015 01:58 IST|Sakshi

ఎన్నికల వేళ నగరంలో  జ్యోతిష్యులకు పెరిగిన డిమాండ్
ఎన్నికల్లో గెలుపు కోసం ప్రత్యేక పూజలు, హోమాలు

 
బెంగళూరు :  బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల వేడి నగరంలో రోజురోజుకు పెరుగుతోంది. బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు చేసేందుకు గాను మరో మూడు రోజులే గడువు ఉన్న సమయంలో అన్ని ప్రధాన పార్టీలు శుక్రవారం నాటికి తమ అభ్యర్థుల పూర్తి స్థాయి జాబితాలను విడుదల చేసేందుకు సన్నద్ధమయ్యాయి. ఇక జాబితాలో స్థానం సాధించిన అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు మిగిలింది కేవలం శనివారం, సోమవారం మాత్రమే.  అందువల్ల తమకు కచ్చితంగా జాబితాలో చోటు లభిస్తుందని భావిస్తున్న అభ్యర్థులంతా ఈ రెండు రోజుల్లో తాము నామినేషన్ వేసేందుకు ఏ రోజు మంచిదో తెలుసుకునేందుకు గాను జ్యోతిష్యుల దగ్గరికి పరుగులు తీస్తున్నారు.

ఏ రోజున నామినేషన్ దాఖలు చేస్తే తమ విజయం గ్యారంటీనో తెలుసుకొని ఆయా రోజుల్లోనే నామినేషన్ దాఖలు చేయాలని వీరంతా భావిస్తున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే బీజేపీ తన మొదటి విడత జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు నామినేషన్‌లను దాఖలు చేశారు. కాగా,  వీరు తమ విజయం కోసం ప్రత్యేక పూజలను చేయించడంలో నిమగ్నమయ్యారు. దీంతో ప్రస్తుతం నగరంలో జ్యోతిష్యులకు, పురోహితులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

 నామినేషన్‌కో మంచిరోజు...
 బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించిన ఈనెల 3న ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఈనెల10న ముగియనుందన్న విషయం తెలిసిందే. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంపై శుక్రవారం సాయంత్రానికి కానీ అన్ని పార్టీలు పూర్తి స్థాయి జాబితా విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు.  అయితే కచ్చితంగా తమకే బీ-ఫాంలు లభిస్తాయని నమ్మకంతో ఉన్న నేతలంతా ఇప్పటికే జ్యోతిష్యులను సంప్రదిస్తూ, నామినేషన్ వేసేందుకు ఏది మంచి రోజో చెప్పాలని కోరుతున్నారు. ఈ విషయంపై కర్ణాటక జ్యోతిష్యుల సంఘం సభ్యుడొకరు  స్పందిస్తూ...‘ ఏ రోజు నామినేషన్ వేయాలో చెప్పాల్సిందిగా కోరుతూ మా వద్దకు వస్తున్న అభ్యర్ధుల సంఖ్య రోజు రోజుకు అధికమౌతోంది. అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్ధులు ఈ వరుసలో ఉన్నారు. అభ్యర్ధుల జన్మనక్షత్రం, పుట్టిన తేదీ తదితర వివరాలను బట్టి మేం నామినేషన్ దాఖలుకు శనివారం, సోమవారాల్లో ఏది మంచి రోజో చెబుతున్నాం. అంతేకాదు ఈ ఎన్నికల్లో తమను గెలుపు వరిస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కూడా చాలా మంది అభ్యర్ధులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఈ వివరాలు చెప్పడానికి అభ్యర్ధి వివరాలతో పాటు ప్రత్యర్ధి జన్మనక్షత్రం కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాం’ అని తెలిపారు.

 గెలుపు కోసం ప్రత్యేక పూజలు....
 నామినేషన్‌లు దాఖలుకు, పోలింగ్ తేదీకి మధ్య చాలా తక్కువ సమయం ఉండడంతో తమను విజయ తీరాలకు చేర్చే భారాన్ని చాలా మంది నేతలు ఆ భగవంతుడికే అప్పగించాలని భావిస్తున్నారు. అందుకే మొదటి జాబితాలో స్థానం సంపాదించుకున్న వారితో పాటు సీటు తప్పక లభిస్తుందని భావిస్తున్న నేతలంతా  తమ గెలుపును ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు, హోమాలు తదితర కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమను గెలిపించాల్సిందిగా భగవంతుని ప్రార్ధిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలతో పాటు నగరంలోని ప్రఖ్యాత దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. వీటన్నింటితో రాష్ట్రంలో పురోహితులు, జ్యోతిష్యులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు