కరుణపైనే ఆయనకు మక్కువ

17 Aug, 2018 11:52 IST|Sakshi
వాజపేయితో కరుణానిధి (ఫైల్‌) వాజ్‌పేయితో జయలలిత

వాజపేయికి చేదు అనుభవమే

జయ వ్యతిరేక ఓటుతో ప్రభుత్వం పతనం

సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో నామమాత్రంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి జవసత్వాలు కల్పించి అధికారంలోకి వచ్చేలా బలోపేతం చేసిన ఆ పార్టీ నేతల్లో ప్రథముడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి అని చెప్పక తప్పదు. అయితే అంతటి మహానేత జీవితంలో చారిత్రాత్మక చేదు అనుభవాన్ని తమిళనాడు మిగిల్చింది.

1996లో అటల్‌ ప్రభుత్వం తొలిసారిగా ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చినా తగిన మెజార్టీ లేకపోవడంతో ప్రధాని పదవికి వాజ్‌పేయి రాజీనామా చేశారు. ఎన్‌డీఏలో లేని కొన్ని ఇతర పార్టీల వారు వాజ్‌పేయ్‌కి లోపాయికారితనంగా మద్దతుపలుకుతామన్నా అయన అంగీకరించలేదు. ఎంపీలను కొనుగోలు చేయడం వంటి నీతిబాహ్యమైన పనులకు పాల్పడడం తనకు నచ్చదు. అందుకే మెజార్టీ లేదని ఒప్పుకుంటూ రాజీనామా చేస్తున్నానని వాజ్‌పేయ్‌ నిజాయితీగా తప్పుకున్నారు. ఇంద్రకుమార్‌ గుజ్రాల్‌ ప్రభుత్వం కూలిపోయిన తరువాత 1998–99లో వచ్చిన మద్యంతర ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రాగా వాజ్‌పేయి ప్రధాని అయ్యారు. ఆనాటి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి అన్నాడీఎంకే మద్దతు పలికింది.

ఈ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కూటమి తమిళనాడులో 39కి గానూ 30 సీట్లు గెలుచుకుని జాతీయస్థాయిలో ప్రాముఖ్యతను పొందింది. అన్నాడీఎంకే కీలకపాత్ర పోషించగా అప్పటి ఎన్నికల్లో ఎన్‌డీఏకి 255 సీట్లు దక్కగా 37.5 శాతం మెజార్టీతో అత్యధిక శాతం సీట్లు కలిగిన కూటమిగా కేంద్రంలో వాజ్‌పేయ్‌ నేతృత్వంలో ప్రభుత్వం అవతరించింది. కేంద్రంపై తనకు పూర్తి పట్టు ఉండడంతో జయ కొన్ని కోర్కెలను వాజ్‌పేయ్‌ ముందుంచింది. తనపై ఉన్న అన్ని అవినీతి కేసులను ఎత్తివేయాలని, రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని జయ కోరారు. ఇందుకు వాజ్‌పేయ్‌ ప్రభుత్వం నిరాకరించడం జయకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఎన్‌డీఏ ప్రభుత్వ బలపరీక్ష సమయంలో జయ తన చేతిలో ఉన్న ఒకే ఒక ఓటును వ్యతిరేకంగా వేయడం ద్వారా 13 నెలల వాజ్‌పేయ్‌ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. ఈ రకంగా వాజ్‌పేయ్‌కి తమిళనాడుతో శాశ్వతమైన చేదు అనుభవమే మిగిలింది.

తమిళనాడుతో తరగని అనుబంధం:
1983–84 మధ్యకాలంలో బీజేపీ నేతగా వాజ్‌పేయ్‌ తొలిసారి తమిళనాడులో కాలుమోపి కోయంబత్తూరుకు వచ్చారు.
1995లో ఎండీఎంకే మహానాడుకు వాజ్‌పేయ్‌ హాజరయ్యారు.
1995లో మదురైకి, 1997లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని హోదాలో తిరుచ్చిరాపల్లికి వచ్చారు.
రెండోసారి ప్రధాని అయినపుడు 1999లో శ్రీలంక ఈలం తమిళుల రక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలపై అప్పటి తమిళనాడుముఖ్యమంత్రి కరుణానిధితో పలుమార్లు మాట్లాడారు.
2001లో తిరుచ్చిరాపల్లి పర్యటనలో వాజ్‌పేయితోపాటూ వైగో, డాక్టర్‌ రాందాస్, కాంగ్రెస్‌ నేత కుమారమంగళంతోపాటూ ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఉండడం చెరిగిపోని చరిత్ర.
కావేరి జలవివాదంపై 2002–03 మధ్య కాలంలో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ అగ్రనేత శ్రీకృష్ణ, తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వంతో చర్చలు జరిపారు.
2004 ఏప్రిల్‌లో రోడ్డు మార్గంలో నెల్లూరుకు వెళ్లేందుకు చెన్నై ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధాని వాజ్‌పేయ్‌కి ముఖ్యమంత్రి జయలలిత స్వాగతం పలకడం ద్వారా స్నేహాన్ని పెంచుకున్నారు.
తమిళనాడులోని అందరు నేతల కంటే కరుణానిధి అంటే వాజ్‌పేయ్‌కి ఎంతో ప్రేమాభినాలు కనబరిచేవారు.

మరిన్ని వార్తలు