ఏటీఎంలకు భద్రతపై నేటితో గడువు పూర్తి

24 Nov, 2013 03:40 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించాలని ప్రభుత్వం విధించిన గడువు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ముగియనుంది. తదుపరి... గార్డులు లేని ఏటీఎం కేంద్రాలను మూసి వేయిస్తామని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ ఇదివరకే హెచ్చరించారు. దీంతో బ్యాంకులు యుద్ధప్రాతిపదికన గార్డులను నియమించే పనిలో పడ్డాయి. నగరంలో రెండు వేల ఏటీఎంలుంటే, ఆరు వందల కేంద్రాల్లో గార్డులు లేరు. కొన్ని బ్యాంకులు తమ ఏటీఎం కేంద్రాల వద్ద రాత్రి పూట మాత్రమే గార్డులను నియమిస్తున్నాయి.

ఇక మీదట అలా కాకుండా 24 గంటలూ కాపలా పెట్టాల్సి ఉంది. గత మంగళవారం ఉదయం ఇక్కడి బీబీఎంపీ కార్యాలయం సర్కిల్‌లోని కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో అదే బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై ఓ ఆగంతకుడు వేట కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఇక్కడి కెంగేరిలోని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకు ఆమె పరిస్థితి మెరుగు పడుతోందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

మరో వైపు ఆగంతకుని కోసం అధికారులు సహా 200 మందికి పైగా సిబ్బంది గాలిస్తున్నారు. ఐదు రోజులుగా తీవ్రంగా గాలిస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. మధ్యలో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలి వేస్తున్నారు. కర్ణాటకతో పాటు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అనంతపురం, హిందూపురం పరిసరాల్లోనే పోలీసుల దృష్టి కేంద్రీకృతమై ఉంది. హిందూపురంలోని పలు సర్కిళ్లలో ఆగంతకుని ఫొటో, బహుమతి వివరాలతో కూడిన పోస్టర్లను అంటించారు. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్, కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లో కూడా ఇలాంటి పోస్టర్లు వెలిశాయి.

ఆంధ్ర సరిహద్దులోని చిక్కబళ్లాపురం జిల్లా గౌరిబిదనూరు, తుమకూరు జిల్లా మధుగిరిల్లో తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కేసు పోలీసులకు సవాలుగా మారడంతో పాటు... ‘ ప్చ్, ఇన్నాళ్లయినా ఆ దుండగుని పట్టుకోలేదా..’ అనే పెదవి విరుపులు వారిపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఆగంతకుని చుట్టు ముట్టామని, ఏ క్షణంలోనైనా పట్టుకుంటామని పోలీసు అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి మొబైల్ ఫోన్‌ను హిందూపురంలో విక్రయించినందున, ఆగంతకుడు చుట్టు పక్కల ఎక్కడో దాక్కుని ఉంటాడని  పోలీసులు అనుమానిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు