నానో టెక్నాలజీకి ఉజ్వల భవిష్యత్తు

28 Sep, 2016 12:23 IST|Sakshi
నానో టెక్నాలజీకి ఉజ్వల భవిష్యత్తు
ఏయూ క్యాంపస్‌: నానో టెక్నాలజీకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య పి.ఎస్‌.అవధాని అన్నారు. మంగళవారం ఉదయం ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాలల సెంటర్‌ ఫర్‌ నానో టెక్నాలజీ నిర్వహించిన ‘నానో ఫ్యూయిడ్స్‌ అప్లికేషన్స్‌ ఫర్‌ హీట్‌ ట్రాన్స్‌ఫర్‌ అండ్‌ ఎనర్జీ సిస్టమ్స్, సిమ్యులేషన్‌ యూజింగ్‌ డీఎఫ్‌డీ’ సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలు ప్రపంచ ప్రగతిని మార్చివేస్తున్నాయన్నారు. చిన్నపాటి ఆవిష్కరణలే ఎంతో పేరు తీసుకువస్తాయన్నారు. సదస్సు సమన్వయకర్త ఆచార్య కె.రాంజీ మాట్లాడుతూ నానో ఫ్లూయిడ్స్‌ అనువర్తనాలను వివరించారు. చైనా, జపాన్‌లు నూతన సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ముందుంటున్నాయన్నారు. మూడు రోజుల సదస్సు ముఖ్యాంశాలను వివరించారు.

పాలకమండలి సభ్యుడు ఆచార్య జి.శశిభూషణరావు మాట్లాడుతూ స్టెల్త్‌ టెక్నాలజీ, సబ్‌మెరైన్‌లలో వినియోగిస్తున్న నూతన సాంకేతికతను వివరించారు. పాలక మండలి సభ్యులు ఆచార్య సురేష్‌ చిట్టినేని మాట్లాడుతూ నూతన ఆవిష్కరణల దిశగా పనిచేయడం ఎంతో అవసరమన్నారు. సాంకేతిక మార్పులు, ఆవిష్కరణలకు అవకాశం ఉన్న అంశాలను వివరించారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ట్రిచి) ఆచార్యుడు సురేష్‌ మాట్లాడుతూ నానో ఫ్లూయిడ్స్‌కు రక్తం మంచి ఉదాహరణన్నారు. శరీర వ్యవస్థలను నానో సాంకేతికతతో అనుసంధానించి వివరించారు. శిక్షణ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతనిధులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు