ప్రయాణికులను నిరాకరిస్తే అంతే..ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు జరిమానా

11 Oct, 2013 00:44 IST|Sakshi
సాక్షి, ముంబై: ప్రయాణికులు తాము చేరుకోవాల్సిన గమ్యస్థానాలకు చేరవేయడానికి నిరాకరించే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను పట్టుకోవడం కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన ఈ డ్రైవ్‌లో తక్కువ దూరంలో ప్రయాణికులను తరలించేందుకు నిరాకరించిన 544 మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని జరిమానా విధించారు. కాగా, ఆటో డ్రైవర్లకు ఒకొక్కరికి రూ.100 జరిమానా విధించగా, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.200 జరిమానా విధించారు.
 
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ప్రతాప్ దిగావ్కర్ మాట్లాడుతూ.. ఈ ప్రత్యేక డ్రైవ్‌ను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ డ్రైవ్‌ను కొనసాగించామని తెలిపారు. ‘ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడంలో కొంత మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు నిరాకరిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. దీంతో ఈ డ్రైవ్‌ను నిరవధికంగా కొనసాగించనున్నాం..’ అని ఆయన వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా ఈ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను ఆర్టీవో కార్యాలయానికి తరలించామని, వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రతాప్ పేర్కొన్నారు. అయితే ఈ ట్యాక్సీలు, ఆటోల డ్రైవర్లు ప్రయాణికులను నిరాకరించడం లాంటి సంఘటనలు పునారావృతమైతే వారి లెసైన్సులను, పర్మిట్లను రద్దు చేయనున్నట్లు దిగావ్కర్ తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌ను తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లోని 16 ట్రాఫిక్ అవుట్ పోస్టుల్లో నిర్వహిస్తున్నారు. 
 
మహీం, మాటుంగా, చెంబూర్, ట్రాంబే, ఘాట్కోపర్, విక్రోలి, ములుండ్, బాంద్రా, ఎయిర్‌పోర్ట్, సాకినాకా, డి.ఎన్.నగర్, గోరేగావ్, మలాడ్, కాందివలి, బోరివలి ప్రాంతాలలో ఈ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. కాగా, ప్రతి ఒక్క ప్రాంతంలో నలుగురితో స్క్వాడ్‌లు, 12 మంది కానిస్టేబుళ్ల (వీరిలో నలుగురు మహిళలు)తోపాటు ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్ విధులు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో మహిళా పోలీసు సిబ్బంది సివిల్ దుస్తులు ధరించి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను ఆశ్రయిస్తున్నారు. వీరు నిరాకరిస్తే వెంటనే సదరు డ్రైవర్లకు జరిమానా విధిస్తున్నారని దిగావ్కర్ తెలిపారు. ఇదిలా వుండగా సెప్టెంబర్ 26 నుంచి 29వ వరకు ఇదే తరహాలో నగరవ్యాప్తంగా చేపట్టిన డ్రైవ్‌లో 1,057 మంది ఆటో డ్రైవర్లను, 637 మంది ట్యాక్సీ డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసు విభాగం వారు పట్టుకొని జరిమానా విధించినట్లు ఆయన వెల్లడించారు. 
 
మరిన్ని వార్తలు