సముద్రాన్ని తలపిస్తున్న ఊటీ

9 Aug, 2019 08:57 IST|Sakshi

సాక్షి, చెన్నై:  నీలగిరుల్లో వరుణుడు ప్రళయ తాండవం చేశాడు. జనావాస ప్రాంతాల్లో కాకుండా అడవుల్లో భారీ వర్షం పడింది. రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో నీలగిరి జిల్లా అవలాంచి అడవుల్లో 82 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో ఊటీ సముద్రాన్ని తలపిస్తుంది. నీలగిరులు వరదలతో అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాలతో నీలగిరి కొండల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండల నడుమ ఉండే ఊటీ పట్టణంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో పట్టణంలోని అన్ని వీధులు సముద్రాన్ని తలపిస్తున్నాయి.

ఊటీ నడిబొడ్టున ఉండే లేక్ లోకి వరదనీరు పోటెత్తటంతో బస్టాండు, రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు వాగుల్లా దర్శనిమిస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాని పరిస్థితి. కొన్ని కాలనీలు నీట మునగటంతో ప్రభుత్వ సిబ్బంది వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. నీలగిరి జిల్లాలోని ఊటీ, కూనూరు, కొత్తగిరి ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఊటీ‌ వచ్చే వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా మేట్టుపాలయం ఊటీ మార్గాలలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటం ఆ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసిన అధికారులు నిత్యావసర వస్తువులను మాత్రం భద్రతతో అనుమతిస్తున్నారు. ఇక కోయంబత్తూరులో ఇద్దరు వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని వార్తలు