యువతీ యువకులకు అవార్డులు

31 Dec, 1998 00:00 IST|Sakshi

 చెన్నై, సాక్షి ప్రతినిధి: సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న యువతీ యువకులకు ప్రోత్సాహక అవార్డులను బహూకరించాలని నిర్ణయించిన ట్లు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. ప్రభుత్వం తరపున కొత్తగా ఈ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు ఆమె తెలిపారు. బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి రాష్ట్ర యువత అవార్డు’ పేరుతో ఏటా వీటిని ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. 15 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులైన ముగ్గురేసి యువకులు, యువతులకు ఈ అవార్డులను అందజేస్తామని అన్నారు.
 
 ప్రతి ఏటా జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ అవార్డు కింద రూ.50 వేల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తామన్నారు. ప్రజలకు సేవచేయడంలో ప్రభుత్వంతోపాటూ ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నదే తమ అభిమతమని చెప్పారు. ఈ విషయంలో యువత మరింతగా ముందుకు రావాలని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు నాందిగా అవార్డును ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. అవార్డులతో ప్రభుత్వ పరంగా గుర్తింపు లభించడం వల్ల పెద్ద సంఖ్యలో యువతీ యువకులు సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఉత్సాహం ప్రదర్శించగలరని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే ఎప్పటి నుంచి అవార్డులను ప్రవేశపెడుతున్నారో ఆమె ప్రకటించలేదు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది నుంచే ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పిస్తుందని తెలిపారు.
 
 ప్రతిపక్షాల వాకౌట్
 ఇసుక మాఫియా, శ్రీలంక సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు స్పీకర్ ధనపాల్ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. రాష్ట్రంలోని ఇసుక మాఫియా మరింతగా రెచ్చిపోయి అక్రమ రవాణా సాగించడం, అడ్డొచ్చిన అధికారులపై ట్రాక్టర్లతో తొక్కించడంపై డీఎండీకే, వామపక్షాలు చర్చకు పట్టుపట్టాయి. అలాగే శ్రీలంక చెరలో ఉన్న తమిళ జాలర్లను విడిపించాలని కోరుతూ మత్స్యకారులు సమ్మె పాటించడంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరాయి. అయితే ఈ సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నందున చర్చకు తావులేదని నిరాకరించారు. దీంతో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.
 

మరిన్ని వార్తలు