చిన్ని పొట్టకు కష్టాలా?

4 Aug, 2018 10:20 IST|Sakshi
బిడ్డకు తల్లిపాలే అమృతం. బెంగళూరులో అవగాహన కార్యక్రమంలో తల్లులు (ఫైల్‌)

స్తన్యమివ్వడంలో 70 శాతం తల్లులకు ఆటంకాలు  

అవగాహనలేమి, అననుకూల పరిస్థితులు  

తల్లీబిడ్డ ఆరోగ్యానికి ముప్పు  

సాక్షి బెంగళూరు:   చిన్నారి శిశువుకు ప్రపంచంలో తల్లి పాల కంటే స్వచ్ఛమైన పౌష్టికాహారం లేదు. శిశువు సంపూర్ణ ఆరోగ్యానికి, అలాగే తల్లి క్షేమా ని కి కూడా స్తన్యమివ్వడం ఎంతో దోహదం చేస్తుంది. అయితే దాదాపు 70 శాతం మాతృమూర్తులు పిల్లలకు స్తన్యం ఇవ్వడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఒక సర్వేలో తేలింది. కొన్ని ఆరోగ్య కారణాలు, పనిచేసే చోట తగిన వాతావరణం లేకపోవడం ఇందుకు కొన్ని కారణాలుగా తేలింది. ఏటా ఆగస్టు తొలివారాన్ని (1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు) ‘ప్రపంచ తల్లిపాల వారం’గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మామ్‌ప్రెస్సో అనే సంస్థ నిర్వహించిన సర్వేలో శిశువుల తల్లుల సమస్యలు వెలుగుచూశాయి. 

510 మంది నుంచి అభిప్రాయ సేకరణ  
మొత్తం 510 తల్లుల నుంచి అభిప్రాయాలు సేకరించి సంస్థ ప్రతినిధులు అధ్యయనం జరిపారు. సర్వే ప్రకారం 70 శాతం తల్లులు పిల్లలకు పాలివ్వడం ఎంతో సవాలుతో కూడుకున్న పనిగా తే ల్చారు. వీరిలో 78 శాతం మంది పిల్లలకు సంవత్సరం అంతకంటే ఎక్కువ కాలం పాలిస్తున్నారు. 

స్తన్యం వల్ల చంటిపిల్లలు ఆరోగ్యంగా ఉం టారని 98.6 శాతం మాతృమూర్తులు పేర్కొ న్నారు. 57.5 శాతం మందిలో తల్లి ఆరోగ్యం మెరుగైనట్లు, ప్రసవం తర్వాత తల్లి బరువు 39.7 శాతం మందిలో తగ్గినట్లు సర్వేలో తేలింది.  ఏ తల్లైనా తన బిడ్డ ఆరోగ్యంగా, అందంగా ఉండాలని కోరుకుంటుంది. చకచకా ఎదగాలని, ఎలాంటి అనారోగ్యం దరిచేరకూడదని వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటుంది.  అయితే అందుకు దోహదం చేసే తల్లిపాల విషయంలో అంత అవగాహన లేదని ఒక సర్వే చెబుతోంది. తల్లీబిడ్డకు ఆరోగ్యాన్ని పెంపొందించే తల్లిపాల ప్రాధాన్యం పై ప్రచారం మరింత పెరగాల్సి ఉంది.  

ఇవే ప్రధాన ఆటంకాలు  
తల్లుల సమస్యల విషయానికి వస్తే 31.8 శా తం మంది పిల్లలకు అర్ధరాత్రులు లేదా ఎక్కువసార్లుపాలివ్వడంఇబ్బందిగామారినట్లు చెప్పారు.  
17.8 శాతం మంది బహిరంగ ప్రాంతాల్లో స్తన్యమివ్వడం ఇబ్బందిగా ఉందన్నారు.  
 38 శాతం మంది తొలిసారి తల్లయినవారు అయోమయానికి గురవుతున్నారు.  
 స్తన్యమెలా ఇవ్వాలి అని ఇతరుల సలహాలను తీసుకుంటున్నారు. 24 శాతం మంది తమ తోటి వారి దగ్గరి నుంచి సమాచారం సేకరించగా, 24 శాతం మంది ఇంటర్‌నెట్‌ ద్వారా, 19.9 శాతం మంది వైద్యుల ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.  

తల్లి పాలను మించిన బహుమతి లేదు
అప్పుడే పుట్టిన శిశువులకు తల్లిపాల కంటే విలువైన బహుమతి మరొకటి ఉండదు. పుట్టిన తొలి గంట నుంచి తొలి ఆరు నెలల పాటు శిశువుకు స్తన్యపానం ఇవ్వడం వల్ల వారి మిగిలిన జీవితంలో దాని తాలుకు లాభాలను శిశువులు పొందుతారు. తల్లిపాలు శిశువుకు కావాల్సిన అన్ని రకాల పౌష్టిక విలువలను అందజేస్తుంది. రెండేళ్ల వయసు వరకు కూడా శిశువుకు తల్లిపాలు ఇవ్వడం కొనసాగించవచ్చు. స్తన్యపానం వల్ల శిశువు మానసిక, శారీరకంగా మిగిలిన జీవితాన్ని ఆరోగ్యంగా జీవించడంలో సహకరిస్తుంది.  – డాక్టర్‌ దేవిక, డా.అనితా కె. మోహన్, గైనకాలజిస్టులు, బెంగళూరు 

మరిన్ని వార్తలు