డెంగీ బెంగ

9 Jun, 2018 09:17 IST|Sakshi
వీరనారాయణపురంలో ప్రజలు

రాయగడ : వర్షాకాలం ప్రారంభంలోనే డెంగీ జ్వరం ప్రభావం ఉండవచ్చన్న ముందస్తు ఆలోచనతో ప్రజలను చైతన్యవంతులను చేస్తూ గ్రామీణ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆశకార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్లకు జిల్లా యంత్రాంగం, జిల్లా వైద్య విభాగం ఆదేశాలు జారీ చేశాయి. ఇటీవల డెంగీ దినోత్సవాన్ని నిర్వహించి మరిన్ని సూచనలు ఇస్తూ డెంగీ జ్వరానికి మందులు లేవని పరిసరాల శుభ్రతతో సహా ఇళ్లలో వేపాకు పొగ వేస్తూ ఇంట్లో మంచినీటి నిలువలు ఉండకుండా ప్రజలు దొమతెరల్లో నిద్రించాలని సూచించారు. అయితే రాయగడ జిల్లా ఆస్పత్రికి 7కిలోమీటర్ల దూరంలో గల కొత్తపేట గ్రామపంచాయతీ వీరనారాయణపురం గ్రామంలో ప్రజలు జ్వరాలతో బాధ పడుతున్న సమాచారంతో   జిల్లా వైద్యబృందం గ్రామానికి వెళ్లి 13మంది రక్తనామూనాలు సేకరించి కొరాపుట్‌ రక్తపరీక్ష కేంద్రానికి పంపగా ఆ నమూనాల్లో  ఏడుగురు వ్యక్తులకు డెంగీ జ్వరం సోకినట్టు  వైద్య పరీక్షలో తేలింది.

 గ్రామంలో పారిశుద్ధ్య లోపం 
 గ్రామంలో సుమారు వంద కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో గొట్టపు బావుల ప్రాంతంలో బురద పేరుకుపోయి, కాలువల్లో టన్నుల కొద్దీ పూడికలు నిండిపోవడంతో   జిల్లాలో మొట్టమొదటిసారిగా డెంగీ వ్యాధి బయటపడింది. పంచా యతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పారిశుద్ధ్య నిర్మూలన కార్యక్రమాలు, స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలు సరిగా చేయకపోవడం, పంచాయతీ  ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా డెంగీ విజృంభించింది. గ్రామంలో సక్రమంగా దోమతెరలు వినియోగించక పోవడం, కాలువలు, గొట్టపు బావులు, ఇళ్ల దగ్గర నీటి నిలువలు నిలిచిపోవడంతో దోమలు విస్తరించి గ్రామస్తులు  జ్వరాల బారిన పడుతున్నారు. గ్రామ సమీప జీమిడిపేట  ప్రభుత్వ ఆస్పత్రిలో డెంగీ జ్వరం సోకిన పవిత్ర కడ్రక మగవాడు(7) రంజిత తాడింగి(20) అర్జుమహనందియా(15) మధుబాయిసారక (23) కుమారిసారక(17)తదితరులు చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ఇంకా  జ్వరపీడితులు అధికంగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు