టెంకాయలు నిషిద్ధం..

27 Dec, 2014 22:14 IST|Sakshi

సాక్షి, ముంబై: ఉత్తర భారతదేశంలో సుప్రసిద్ధ దేవాలయంగా వినుతిగాంచిన నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయంలోకి కొబ్బరి కాయలు, పూలు, హారాలు, స్వీట్లు, పూజా సాహిత్యాన్ని నిషేధించారు. ఈ మేరకు ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీన్ని నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు ఇప్పటికే అక్కడక్కడ బోర్డులు, పోస్టర్లు ఏర్పాటుచేశారు.

ఆలయ కమిటీ తీసుకున్న నిర్ణయంతో భక్తులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంతో దూరం నుంచి త్రయంబకేశ్వరుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కేవలం నమస్కారంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆలయానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా కారణాల దృష్ట్యా ఈ కఠోర నిర్ణయం తీసుకోక తప్పలేదని కమిటీ స్పష్టం చేసింది.

ప్రముఖ 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర్ ఒకటి. దీంతో ఈ ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు, నాసిక్‌లో పంచవటికి, శిర్డీకి వచ్చిన సాయి భక్తులు, ఇతర పర్యాటకులు ఈ త్రయంబకేశ్వర్‌ను సందర్శించకుండా వెళ్లరు. ఇక్కడే గోదావరి నది పుట్టిన విషయం తెలిసిందే. త్రయంబకేశ్వర్ ఆలయంలో ప్రత్యేక దర్శనం, వీఐపీ పాస్‌లు, డబ్బులు చెల్లించి శీఘ్ర దర్శనం లాంటి ప్రత్యేక సౌకర్యాలేమి లేవు. ఇక్కడ అందరు సమానమే. అందుకు దేవుని దర్శనం కోసం ఎవరైనా గంటల తరబడి క్యూలో నిలబడాల్సిందే. ఇలా అనేక ప్రత్యేకతలు ఈ ఆలయానికి ఉన్నాయి.

ఈ ఆలయం కీర్తి దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతుండటంతో భక్తుల తాకిడి కూడా అధికమైంది. అదే స్థాయిలో ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని తరుచూ కేంద్ర గుడాచార నిఘా సంస్థ హెచ్చరిస్తూ వస్తోంది. అందుకు భద్రతలో అనేక మార్పులు చేయాలని సూచించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొబ్బరి కాయలు, పూలు, హారాలు, మిఠాయి బాక్స్‌లతో పాటు అర్చన సాహిత్యాన్ని జనవరి ఒకటో తేదీ నుంచి నిషేధిస్తున్నారు.

ఇదిలా ఉండగా, అర్చన సామాగ్రిని నిషేధించడంలో వీటిపై ఆధారపడిన అనేక కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. ఆలయానికి సమీపంలో, వాహనాల పార్కింగ్ లాట్‌లో పూజా సామాగ్రి విక్రయించే వందలాది షాపులున్నాయి. వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. తాము ఉపాధి కోల్పోయి వీధిన పడతామని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు