బంద్ సక్సెస్

23 Nov, 2014 03:00 IST|Sakshi
బంద్ సక్సెస్

తమిళనాడు ప్రయోజనాలను కాలరాస్తూ కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడాన్ని నిరసిస్తూ డెల్టా జిల్లాల్లో శనివారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. 3 జిల్లాల్లో చేపట్టిన ఆందోళనల ఫలితంగా సుమారు 1500 మంది అరెస్టయ్యారు.
 
 చైన్నై, సాక్షి ప్రతినిధి:  కావేరీ నది వాటా జలాలను తమిళనాడు ప్రభుత్వం పోరాడి సాధించుకుంది. రాజకీయపరంగానే కాక, న్యాయపరంగా సుప్రీంకోర్టు ద్వారా హక్కులను పొందగలిగింది. సుప్రీంకోర్టు తీర్పు సైతం తమిళనాడుకు అనుకూలంగా మారడంతో దిక్కుతోచని కర్ణాటక ప్రభుత్వం కావేరీ జలాల ప్రవాహాన్ని అడ్డుకునేలా కొత్తగా రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి సమాయత్తం అవుతోంది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన పక్షంలో తమిళనాడులోని డెల్టా జిల్లాలైన తంజావూరు, నాగపట్నం, తిరువారూరు ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పవు. కావేరి నదీజలాల కిందిప్రాంతమైన తమిళనాడు అంగీకారం లేకుండా కర్ణాటక ప్రభుత్వం ప్రాజెక్టులను కట్టడం చట్టవిరుద్ధమని సీఎం పన్నీర్ సెల్వం కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కర్ణాటక దుందుడుకు వైఖరికి కేంద్రం అడ్డుకట్టవేయాలని కోరుతూ డెల్టా జిల్లాలు శనివారం బంద్ పాటించాయి. మూడు జిల్లా ల్లో దుకాణాలు మూతపడ్డాయి. వ్యవసాయ, వ్యాపార సంఘాల ప్రతినిధులు బంద్‌కు నాయకత్వం వహిస్తూ ఆందోళనకు దిగారు.
 
 తంజావూరులో ఎండీఎంకే అధినేత వైగో తన అనుచరులతో కలిసి రైల్‌రోకోకు యత్నించడంతో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. తంజావూరు జిల్లాలో 200 చోట్ల రాస్తారోకో నిర్వహించారు. తిరువారూరులో ప్రయివేటు వైద్యులు సైతం విధులను బహిష్కరించి బంద్‌లో పాల్గొన్నారు. నాగై జిల్లాల్లో పెద్ద ఎత్తున వ ర్తక సంఘాలు బంద్‌లో పాల్గొనగా ప్రయివేటు వాహనాలు నిలిచిపోయాయి. మన్నార్‌కుడిలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ సందర్భంగా వంద మందిని అరెస్ట్ చేశారు. మన్నార్‌కుడి నుంచి మయిలాడుదురై వైపు వెళ్లే రైలును ఆందోళనకారులు అడ్డగించారు. ఈ సంఘటనలో 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొత్త పార్టీ పెట్టబోతున్న కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ అనుచరులు సైతం బంద్‌కు మద్దతుగా ఆందోళన నిర్వహించారు. మూడు జిల్లాల్లో డీఎంకే, ఎండీఎంకే, నామ్ తమిళర్ కట్చి తదితర పార్టీలవారు, రైతు సంఘాల నాయకులు కలిపి సుమారు 1500 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సహజంగా ఏ బంద్ అయినా మధ్యాహ్నం వేళకు ముగిసే సంప్రదాయూన్ని పారద్రోలి సాయంత్రం 6 గంటల వరకు బంద్ పాటించడం విశేషం.
 

>
మరిన్ని వార్తలు