మిడ్‌నైట్‌ మెట్రో

2 Aug, 2019 08:09 IST|Sakshi

అర్ధరాత్రి వరకూ రైలు సర్వీసులు  

నగరవాసులకు మరింత సౌలభ్యం  

సాక్షి, బెంగళూరు: రాత్రి వేళ్లలో పని చేసే కార్మికులు, వారంతపు సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లే వారు, రాత్రి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి అనుకూలంగా ఉండేందుకు మెట్రో రైలు సేవలు రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉండాలనే డిమాండ్‌ నెరవేరింది. ఇప్పటివరకు తెల్లవారుజామున 5.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రజల డిమాండ్ల మేరకు అర్ధరాత్రి 12 గంటలు దాటే వరకు మెట్రో రైళ్లు నడుపుతున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ప్రతి 5 నిమిషాలకు ఒక మెట్రో రైలు సంచరిస్తే,  రాత్రివేళ్లల్లో రద్దీ తక్కువ ఉంటుందని ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు సంచరిస్తుంది. 

లక్షలాది మందికి ఉపయోగం
మెట్రోసేవలు రాత్రి 12 గంటల వరకు అందుబాటులోకి తేవడంతో బెంగళూరువాసులకు ప్రయాణం మరింత సులభమవుతుంది. ఐటీ బీటీ కంపెనీల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు రాత్రివేళ మెట్రో రైళ్లలో ఆఫీసులకు, ఇళ్లకు చేరుకోవచ్చు. రాజాజినగర, పీణ్య, దాసరహళ్లి, వైట్‌ఫీల్డ్‌ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో పని చేసే కార్మికులు, కంపెనీ ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటోంది. రాజాజినగర, పీణ్యలో మహిళా   కార్మికులు రాత్రి 10.30, 11 గంటల వరకు విధుల్లో ఉంటారు. డ్యూటీ అయ్యాక సొంత వాహనాలు, క్యాబ్‌లలో ఇంటికి వెళ్లేవారు. లేదా తెల్లవారుజాము వరకు వేచి ఉండి సిటీ బస్సుల్లో బయల్దేరేవారు. మెట్రోసేవలు అందుబాటులోకి రావడంతో పేదలకు ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

వర్షాకాలంలో అనుకూలం  
వర్షాకాలం ఆరంభం కావడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. వర్షం వస్తే నగరంలోని రోడ్లన్నీ జలావృతమై ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. చెట్లు కూలి రోడ్లపై వాహనాల సంచారానికి అంతరాయం ఏర్పడుతోంది. గంటలకొద్దీ రోడ్లపైనే చిక్కుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో మెట్రోలో సురక్షితంగా గమ్యం చేరవచ్చు.  

3, 4 తేదీల్లో అంతరాయం  
మెట్రో నిర్వహణ పనుల కారణంగా ఈనెల 3వ తేదీ రాత్రి 9.30 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఎంజీ రోడ్డు నుంచి బయప్పనహళ్లి వరకు మెట్రో సేవలు రద్దు చేస్తున్నట్లు బీఎంఆర్‌సీఎల్‌ అధికారులు తెలిపారు. ఎంజీ రోడ్డు నుంచి నాయుండనహళ్లి వరకు గ్రీన్‌లేన్‌లో నాగసంద్ర నుంచి యలచెనహళ్లి వరకు యథావిధిగా సర్వీసులు నడుస్తాయని చెప్పారు. 

మరిన్ని వార్తలు