న్యాయశాఖ మంత్రి డిగ్రీ పత్రాలు నకిలీవే

14 May, 2015 00:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ ఇక్కట్లు పెరుగుతున్నాయి. ఆయన డిగ్రీ పత్రాలు నకిలీవని ఢిల్లీ బార్ కౌన్సిల్ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై కేసు నమోదు చేసే విషయాన్ని కూడా బార్ కౌన్సిల్ యోచిస్తోంది. జితే ంద్ర సింగ్ తోమర్ పత్రాలు నకిలీవని దక్షిణ ఢిల్లీ డీసీపీకి ఫిర్యాదుచేసింది. తోమర్ సమర్పించిన డిగ్రీ పత్రాలు నకిలీవని ఢిల్లీ బార్ కౌన్సిల్ కార్యదర్శి జిల్లా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాంమనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ నుంచి పొందిన డిగ్రీ పట్టా నకిలీదిగా యూనివర్సిటీ తేల్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిహార్‌లోని తిల్కా మాంఝీ యూనివర్సిటీ నుంచి రిజిష్టర్ నంబర్ 3687 తో పొందినట్లు ఎల్‌ఎల్‌బీ పట్టా నకిలీదని సంబంధిత యూనివర్సిటీ తేల్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపించవలసిందిగా బార్ కౌన్సిల్ ఢిల్లీ పోలీసులను కోరింది. తోమర్ 2011లో బార్‌కౌన్సిల్ సభ్యత్వం కోసం ధరఖాస్తు చేసి అదే సంవత్సరం సభ్యత్వం పొందారు.
 
 న్యాయమంత్రిని అరెస్టు చేయాలి: బీజేపీ
 నకిలీ సర్టిఫికేట్‌ల వ్యవహారంలో న్యాయమంత్రి జితేంద్ర సింగ్ తోమర్‌ను అరెస్టు చేయాలని బీజేపీ బుధవారం డిమాండ్ చేసింది. ఢిల్లీ బార్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు మంత్రిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ డిమాండ్ చేశారు.. ఆప్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గే పోలీసులు ఇంతవరకూ తోమర్‌ను అరెస్టు చేయలేదని విమర్శించారు. గ త 12 రోజులుగా ఈ విషయమై బీజేపీ ప్రశ్నిస్తున్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. పోలీసులు ఎవరి ఒత్తిడికీ తలొగ్గి పని చేయరాదన్నారు. ఢిల్లీని పాలిస్తున్న నకిలీ ప్రభుత్వం, దాని నకిలీ మంత్రుల నిజ స్వరూపాలు బయట పడాల్సి ఉందని ఉపాధ్యాయ అన్నారు.
 

మరిన్ని వార్తలు