నిన్న వేటు.. నేడు బీజేపీలోకి

22 Apr, 2017 16:37 IST|Sakshi
నిన్న వేటు.. నేడు బీజేపీలోకి

న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై విమర్శలు చేసి, ఆ పార్టీ నుంచి సస్పెండైన మరుసటి రోజే ఢిల్లీ నాయకురాలు బర్కా శుక్లా సింగ్‌ బీజేపీలో చేరారు. శనివారం ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఢిల్లీ వ్యవహారాల ఇంఛార్జి శ్యామ్‌ జజును కలసి బీజేపీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా బర్కా సింగ్‌ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను ప్రశంసించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ ఆశించో లేక పార్టీలో పదవుల కోసమో తాను బీజేపీలో చేరలేదని చెప్పారు. పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని తెలిపారు.  నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత మూడేళ్లలో దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు.

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ మాకెన్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన బర్కా సింగ్‌ను శుక్రవారం పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. రాహుల్‌కు పార్టీ నడపడం చేతకాదని, ఆయన పార్టీ అధ్యక్షపదవికి పనికిరారని, మానసికంగా ఆయన సరిగాలేరని విమర్శలు చేయడంతో ఆమెపై వేటు పడింది.

మరిన్ని వార్తలు