పీఠం కోసం ఎత్తుగడ

13 Aug, 2015 01:45 IST|Sakshi
పీఠం కోసం ఎత్తుగడ

బీబీఎంపీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ?
మరోసారి ‘మేయర్’ పదవి
దక్కించుకునేందుకు బీజేపీ వ్యూహం

 
బెంగళూరు :  బీబీఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలుపు సాధించి, మేయర్ పదవిని మరోసారి చేజిక్కించుకోవాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగా అన్ని ప్రయత్నాలు ప్రారంభించింది. బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడం ద్వారా ‘కాంగ్రెస్ రహిత కర్ణాటక రాష్ట్రం’ నినాదానికి నాంది పలకాలని భావిస్తోంది. అందుకే ఈ ఎన్నికల ప్రచారంలో నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీనే స్టార్ ప్రచారకునిగా ప్రచార పర్వంలో పాల్గొనేలా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బెంగళూరు నగరంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించాలని బీజేపీ రాష్ట్ర శాఖ నేతలు భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ బెంగళూరు నగరంలో నిర్వహించిన బహిరంగ సమావేశాలకు ప్రజల నుంచి మంచి స్పందనే లభించింది. ఆయన ప్రచార ఫ లితం పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కూడా కనిపించిందనేది రాజకీయ విశ్లేషకులు చెప్పే వివరణ. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మరోసారి బెంగళూరు నగరం లో ప్రచారం చేయించాలని, త ద్వారా  నగరంలోని ఓటర్లను బీజేపీ వైపు ఆకర్షించాలని ఆ పార్టీ రాష్ట్రశాఖ నేతలు భావిస్తున్నారు.

 మోదీతో ప్రచారం ఎందుకంటే.....
 ఇక రాష్ట్రస్థాయిలోనే కాక కేంద్రస్థాయిలో కూడా ప్రముఖ వ్యక్తులుగా ఉన్న అనంతకుమార్, సదానందగౌడ, యడ్యూరప్ప వంటి వారు ఉండగా ఏకంగా ప్రధానమంత్రి హోదాలోని వ్యక్తిని బీబీఎంపీ ఎన్నికల ప్రచారానికి పిలవాలని బీజేపీ నేతలు అనుకోవడానికి కూడా ఓ లెక్కుంది. బీబీఎంపీ ఎన్నికల్లో విజయం తమదేనని, మరోసారి మేయర్ పీఠాన్ని కచ్చితంగా కైవసం చేసుకుంటామని ఇప్పటి వరకు బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీబీఎంపీలో విజయం కోసం తన శాయశక్తులా కృషి చేస్తోంది. ఇదే సందర్భంలో గతంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో బీబీఎంపీలో జరిగిన కుంభకోణాలు, గార్బేజ్ సిటీ అంటూ వచ్చిన విమర్శలు ఇవన్నీ కలిసి బీజేపీ విజయావకాశాలపై ఈ ఎన్నికల్లో కాస్తంత ప్రభావాన్ని చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సందర్భంలో ఇంటలిజెన్స్ వర్గాలు అందించిన నివేదికలో కూడా బీజేపీ రెండో స్థానంలోనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలాగౌనా సరే తన విజయావకాశాలను మెరుగు పరుచుకునేందుకు గాను ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీనే ప్రచారంలో పాల్గొనేందుకు ఒప్పించే దిశగా బీజేపీ రాష్ట్ర శాఖ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ అంశంపై మరో రెండు రోజుల్లో రాష్ట్ర శాఖ నేతలు ప్రధానిని కలిసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.

 ప్యాలెస్ గ్రౌండ్స్ లేదా బసవనగుడి మైదానం.....
 కాగా, ప్రచార పర్వంలోని చివరి రెండు రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో బీబీఎంపీ ఎన్నికల ప్రచార సమావేశాలను ఏర్పాటు చేయించాలనేది బీజేపీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. ఇక ఈ సమావేశాలకు గాను నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్ లేదా బసవనగుడి నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్‌ను వేదికగా చేసుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇక ఈ ప్రచారంలో పాల్గొనేందుకు కనుక మోదీ అంగీకరిస్తే బీబీఎంపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని స్థాయి వ్యక్తి పాల్గొనడం ఇదే మొదటిసారి అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
 ఓటర్లలో చైతన్యం పెంచే దిశగా...
 
 
 

మరిన్ని వార్తలు