భౌభౌకు లైసెన్స్‌ తప్పనిసరి

22 Jan, 2017 10:05 IST|Sakshi
భౌభౌకు లైసెన్స్‌ తప్పనిసరి

► ఫ్లాట్‌కు ఒక్క పెంపుడు కుక్క మాత్రమే..
► భారీ శునకాలకు నో చాన్స్‌
► త్వరలో అమల్లోకి రానున్న పాలికె నిబంధనలు
 

బెంగళూరు :  ఉద్యాన నగరిలో ఇప్పడు పెంపుడు కుక్కలను పెంచుకోవాలంటే లైసెన్స్‌ తప్పనిసరి కానుంది. అదే విధంగా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌కు ఒక కుక్కను మాత్రమే పెంచుకోవడానికి అనుమతి ఉంటుంది. అలాగే అపార్టుమెంట్‌వాసులు భారీ పరిమాణంలో ఉండే కుక్కలను పెంచుకోవడానికి అనుమతి ఉండదు. ఇలాంటి నిబంధనలను త్వరలో బీబీఎంపీ అమలు చేయనుంది. ఈ మేరకు ప్రతిపాదనలపై ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కోరింది. అనుమతి రాగానే పెంపుడు కుక్కల కోసం పాలికె కార్యాలయం చుట్టూ తిరగక తప్పదు. బెంగళూరులో ఇప్పటి వరకు కుక్కలను పెంచుకోవడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదు. ముంబై, చండీఘడ్‌ తదితర నగరాల్లో కుక్కలను పెంచుకోవాలంటే అనుమతి తప్పనిసరి. దీంతో ఇదే నిబంధనలు బెంగళూరులో కూడా అమలు చేయడం కోసం పాలికె తీవ్ర కసరత్తు చేస్తోంది.     

అనుమతికి రూ. 250 : కుక్కను పెంచుకోవాలనుకునేవారు మొదట బీబీఎంపీ నుంచి అనుమతి పొందడానికి రూ. 250లు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా అపార్ట్‌మెంట్‌ వాసులు భారీ పరిమాణంలో ఉండే బుల్‌డాగ్, జర్మన్‌ షపర్డ్‌ తదితర కుక్కలను అనుమతి ఉండదు, పెంచితే వారికి జరిమానా విధిస్తారు. అదే విధంగా జనవాసాల్లో పెంపుడు కుక్కలను తీసుకువచ్చి బహిర్బూమి, మూత్ర విసర్జన చేయిస్తే వాటి యజమానితోనే శుభ్రం చేయిస్తారు. కుక్కలు పెంచడం హాబీగా ఉన్న వాళ్లు ఇకపై ఈ నిబంధనలు పాటించాల్సిందే.

మరిన్ని వార్తలు