బీ ఖాతాలకు త్వరలో మోక్షం

7 Sep, 2014 02:53 IST|Sakshi
  • 16న బీఎంపీసీ ఎన్నికలు
  •  15న నామినేషన్ల స్వీకరణ
  •  అదే రోజు అభ్యర్థుల ప్రకటన
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగర పరిధిలో రెవెన్యూ భూముల్లో నివేశన స్థలాలను (బీ ఖాతా) కొనుగోలు చేసి, ఏ ఖాతాల (క్రమబద్ధీకరణ) కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న వారికి శుభ వార్త. హైకోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ (బీఎంపీసీ)కి ఈ నెల 16న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ కమిటీ ఏర్పాటయ్యే వరకు బీ ఖాతాలను ఏ ఖాతాలుగా మార్చవద్దని హైకో ర్టు ప్రభుత్వానికి  సూచించిన సంగతి తెలిసిందే.

    నగరంలో ఇప్పటికే అనుమతి పొందిన లేఔట్లు, వాటిల్లో నిర్మించిన అపార్ట్‌మెంట్లకు ఏ ఖాతాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. అయితే సొంతంగా నివేశనాలు కొనుగోలు చేసిన వారికి ఈ ఆదేశాలు వర్తించడం లేదు. రాష్ట్రంలోని పట్టణాల పరిధుల్లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను నిర్ణీత ఫీజు వసూలు చేయడం ద్వారా అక్రమ-సక్రమ పథకం కింద క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.  

    బెంగళూరులోని వ్యక్తిగత నివేశనాలను ఈ పథకం కిందే చేర్చారు. అయితే బీఎంపీసీని ఏర్పాటు చేసేంత వరకు అలాంటి నివేశనాలను క్రమబద్ధీకరించవద్దని హైకోర్టు ఆదేశించింది. దీని వల్ల ఆ కమిటీ ఏర్పాటు కోసం వ్యక్తిగత నివేశనాలను కలిగి ఉన్న వారు ఇన్నాళ్లూ ఎదురు చూస్తూ గడిపారు. కమిటీని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వం గత నెల 25న బెంగళూరు ప్రాంతీయ కమిషనర్‌కు సూచించింది.
     
    18 మంది సభ్యులు ..

    బీఎంపీసీలో మొత్తం 18 మంది సభ్యులుంటారు. బీబీఎంపీ కార్పొరేటర్లు, బెంగళూరు మెట్రోపాలిటన్ ఏరియా (బీఎంఏ)లోని జిల్లా, తాలూకా, గ్రామ పంచాయతీల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఆ 18 మందినీ ఎన్నుకోవాల్సి ఉంటుంది.  పంచాయతీల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఇద్దరు సభ్యులను ఎన్నుకుంటారు. ఓటర్లందరూ పోటీ చేయడానికి అర్హులే.

    ఈ నెల 15న నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమాలుంటాయి. అదే రోజు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఏకగ్రీవమైతే అదే రోజు వెల్లడిస్తారు. కాగా బీఎంపీసీలో పది మంది నామినేటెడ్ సభ్యులు కూడా ఉంటారు. ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో పాటు జాతీయ రాజధాని ప్రాంతీయ ప్రణాళిక మండలి ఈ సభ్యులను నామినేట్ చేస్తుంది.
     

మరిన్ని వార్తలు