క్లిక్‌మంటే.. అవార్డు వచ్చినట్లే!

19 Aug, 2016 16:36 IST|Sakshi
క్లిక్‌మంటే.. అవార్డు వచ్చినట్లే!
బాపట్ల ఫొటోగ్రాఫర్‌ పీవీఎస్‌కు అమెరికా పురస్కారం
నేడు ప్రపంచ ఫొటోగ్రాఫర్స్‌ దినోత్సవం
 
బాపట్ల: మండలంలోని ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పీవీఎస్‌ నాగరాజు తన చేతిలోని కెమెరాను క్లిక్‌ మనిపిస్తే చాలు మండలం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఏదో ఒక అవార్డు సాధించడం ఖాయం. గ్రామీణ ప్రాంతాల ప్రజల స్థితిగతులు, సహజ సిద్ధంగా, ఆహ్లాదకరమైన వాతావరణాలను చూపించే ఆయన ఛాయాచిత్రాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సాధించాయి. నాగరాజు ప్రకృతి ప్రేమికుడిగా, ప్రకతిలో కనిపించే వన్యప్రాణుల దృశ్యాలు తన కెమెరాలో బంధిస్తుంటారు. 
 
అందుకున్న అవార్డులు.. 
జూలైలో అమెరికాలోని ఇమేజ్‌ కోలిగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో గిరిజనుల జీవనశైలిపై తీసిన 12 ఛాయాచిత్రాలు ప్రథమ స్థానంలో నిలిచాయి. దీంతో అమెరికాకు చెందిన కోలిగ్‌ సొసైటీలో పీవీఎస్‌కు జీవితకాల సభ్యత్వాన్ని కల్పించడంతోపాటు, అమెరికా పురస్కారం (హానరి), సర్టిఫికెట్లను ఈమేల్‌ ద్వారా అందజేశారు. మార్చిలో పశ్చిమబెంగాల్‌లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ఉత్తమ పురస్కారంతోపాటు, రూ. 2 వేల నగదు, మెమోంటోను అందుకున్నారు. ఏప్రిల్‌లో న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ పురస్కారం అందుకున్నారు.
 
కలకత్తాలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. జూన్‌లో వెస్ట్‌బెంగాల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆగస్టులో న్యూఢిల్లీలో నిర్వహించిన ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రఫీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో ఉత్తమ పురస్కారం లభించింది. నాగరాజును గురువారం ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్‌ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో అభినందించారు.
మరిన్ని వార్తలు