‘బీ ఖాతా’ స్థలాల రిజిస్ట్రేషన్‌కు అనుమతి

14 Nov, 2013 01:58 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : బీబీఎంపీ పరిధిలో రెవెన్యూ సైట్లను కొనుగోలు చేసి క్రమబద్ధీకరణ కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న వారికి శుభ వార్త. త్వరలో బ్లూప్రింట్లను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించడానికి అమలు చేయనున్న ‘అక్రమ-సక్రమ’ సమయంలోనే బీ ఖాతాలను ఏ ఖాతాలుగా మార్చుతారు. దీనికి గాను జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీ ఖాతా సైట్లలో ఇళ్లు నిర్మించడానికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఇటీవల వాటి రిజిస్ట్రేషన్లను కూడా ప్రభుత్వం నిలుపుదల చేసింది. అయితే బీ ఖాతా సైట్లు, వాటిల్లో నిర్మించిన ఇళ్లు, అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలని రాష్ట్ర మంత్రి వర్గం బుధవారం తీర్మానించింది. తద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల ఆదాయం సమకూరుతుంది. మంత్రి వర్గం ఇతర నిర్ణయాలు...
 
 = ‘వాజ్‌పేయి ఆరోగ్యశ్రీ పథకం’ కింద ఆరోగ్య బీమా సేవలు ఏపీఎల్ కార్డుదారులకూ విస్తరింపు. 1.50 కోట్ల మందికి లబ్ధి.      
 
 = పంటలకు మద్దతు ధరలను నిర్ణయించడానికి కమిషన్ ఏర్పాటు. దాని విధి విధానాలను నిర్ధారించడానికి మంత్రి వర్గం ఉప సంఘం ఏర్పాటుకు అంగీకారం.
 
 = రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో చాలా కాలంగా దిన కూలీలుగా పని చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగులతో దాదాపు సమానంగా వేతనాలు, సెలవులు, ఇతర సదుపాయాలు.
 
 = కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ద్వారా ‘పోలీస్ గృహ-2020’ పథకం కింద మూడే ళ్లలోపు 11,000 ఇళ్ల నిర్మాణం.
 
 = ‘రాజీవ్ గాంధీ చైతన్య పథకం’ కింద రెండు లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన. వీరిలో లక్ష మందికి నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ.
 
 = బెంగళూరులోని సిటీ రైల్వే స్టేషన్‌కు క్రాంతి వీర సంగోళి రాయన్న పేరు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు
 
 = రూ.4103.50 కోట్లతో నారాయణపుర ఎడమ కాలువ, అనుబంధ కాలువల  ఆధునికీకరణ.
 
 = ఎగువ తుంగ ప్రాజెక్టుకు రూ.2561.88 కోట్ల విడుదలకు అనుమతి
 
 = రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యం ఇక మీదట రాష్ట్రంలోనే కొనుగోలు
 

>
మరిన్ని వార్తలు