‘బిచ్చమెత్తుకోవటం భలే బాగుంది’

13 Oct, 2017 18:57 IST|Sakshi

చెన్నైలో రష్యా పర్యాటకుని వింత వైఖరి

విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ సహకారానికి నో

సాక్షి, చెన్నై: ‘దర్జాగా తిరిగితే సరదా ఏముంది...బిక్షమెత్తుకోవడంలోనే మజా ఉంది’ అని భావిస్తున్నాడు రష్యాకు చెందిన ఒక పర్యాటకుడు. ఖర్చుకు కనీస డబ్బులు లేని స్థితిలో బిక్షమెత్తుకుంటున్న అతడికి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ స్నేహహస్తం అందించినా నిరాకరించి చెన్నైలో బిక్షమెత్తుకుంటా అంటూ నగరంలో తిరుగుతున్నాడు.

వివరాలివీ.. రష్యా దేశానికి చెందిన ఈవ్‌జెనీ బేర్టినీ కోవ్‌ అనే వ్యక్తి ఈనెల 9వ తేదీన కాంచీపురం పర్యాటనకు వచ్చాడు. ఖర్చుల కోసం ఏటీఎం వద్దకు వెళ్లగా అతని కార్డు నుంచి సొమ్మురాలేదు. దీంతో విరక్తి చెందిన అతను ఎటీఎం కార్డును విరగొట్టాడు. ఖర్చులకు మరో మార్గం లేకపోవడంతో కాంచీపురంలోని ఒక ఆలయం మెట్ల వద్ద తన టోపీని జోలెగా పడుతూ ఈనెల 10వ తేదీన బిచ్చమెత్తుతూ కూర్చున్నాడు. అదే ఆలయం వద్దనున్న బిచ్చగాళ్లు తమ వరుసలో ఎర్రగా బుర్రగా ఉన్న రష్యా బిక్షగాడిని చూసి ఎంతో మర్యాదగా వ్యవహరించసాగారు. ఆలయానికి వచ్చిన భక్తులు సైతం అయ్యో పాపం అంటూ దండిగా డబ్బులు వేయడం ప్రారంభించారు.

ఇంతలో ఈ సమాచారం పోలీసులకు అందడంతో అతడికి కౌన్సెలింగ్‌ చేసి చెన్నైలో రష్యా రాయబార కార్యాలయానికి కబురంపారు. పోలీసుల సహకారంతో చెన్నైకి చేరుకున్న కోవ్‌, టీ నగర్‌ పరిసరాలు తిరిగి, అక్కడి ఆలయంలో స్వామిని దర్శించుకున్నాడు. తనను పలుకరించిన వారితో అతను మాట్లాడుతూ, రష్యా–ఉగ్రెయిన్‌ మధ్య సైనికపోరు కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఈ కారణంగా తాను పర్యాటక వీసాలో భారత్‌కు చేరుకున్నట్లు తెలిపాడు. భారత్‌కు వచ్చిన సమయంలో తన వద్ద కేవలం రూ.4 వేలు మాత్రమే ఉన్నాయని, ఈ డబ్బు కూడా ఖర్చయిపోవడంతో దిక్కుతోచక కాంచీపురంలో బిక్షమెత్తినట్లు తెలిపాడు. ఈ విషయం పత్రికల్లో రావడంతో కొందరు డబ్బు సహాయం చేశారని చెప్పాడు. 

రష్యాకు ఎప్పుడెళతావు అని ప్రశ్నించగా, చెన్నైలోనే ఉంటూ బిచ్చమెత్తుకుంటాను, ఇదే బాగుందని తెలిపాడు. ఈ విషయంపై రష్యా రాయబార కార్యాలయంలో వివరణ కోరగా, నిబంధనల ప్రకారం ఎవరైనా సాయం కోరినప్పుడే తాము స్పందించాలని, అతని నుంచి ఎటువంటి అభ్యర్దన రాలేదని తెలిపారు. రష్యా పర్యాటకుని భారత్‌ వీసా నవంబరు 22వ తేదీతో ముగియనుంది. రష్యా యువకుడు బిక్షమెత్తుకుంటున్న సమాచారం తెలుసుకున్న భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించిన విషయం తెలిసిందే. ‘ఈవ్‌ జెనీ..మీ రష్యా మాకు మిత్రదేశం, చెన్నైలోని విదేశాంగశాఖ అధికారులు నీకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నారు’ అని తన ట్విటర్‌ ద్వారా ఈనెల 11వ తేదీన సందేశం పంపారు. అయితే సుష్మాస్వరాజ్‌ సహకారంపై రష్యా యువకుడు స్పందించిన దాఖలాలు లేవు.

మరిన్ని వార్తలు