సోషల్‌ మీడియా.. నిద్ర లేదయా

1 Sep, 2018 11:37 IST|Sakshi

నడిరాత్రివరకూ వాటితోనే సహవాసం  

నగరవాసులకు కునుకు కరువు

ఓ సర్వే హెచ్చరికలు  

బెంగళూరులో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల్లో 65 శాతం మంది సరైన వేళకు నిద్రపోవడం లేదు. అర్ధరాత్రి వరకూ సామాజిక మాధ్యమాల్లో విహరిస్తూవిలువైన నిద్రకు టాటా చెబుతున్నారు. ఇప్పటికైనా మేలుకోకపోతే ఆరోగ్యానికి తీరని నష్టమే

బనశంకరి:  నేడు ప్రతి ఒక్కరికి స్మార్ట్‌ఫోన్‌ కరభూషణం అవుతోంది. 12 ఏళ్ల బాలల నుంచి యువ తీ, యువకులు, వయోవృద్ధుల వరకు మొబైల్‌ఫోన్‌ లేకుండా కనిపించడంలేదు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం, వాట్సప్, మెసెంజర్లలో పడి లోకాన్ని మరచిపోతున్నారు. ఈ మిథ్యా ప్రపంచం మోజులో పడితే సుఖమయ నిద్ర దూరమయినట్లే. మొబైల్, ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 93 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. 8 గంటల కంటే తక్కువసేపు నిద్ర పోతున్నారు. సోషల్‌ మీడియాలో  నచ్చిన కార్యక్రమాలను వీక్షిస్తూ అర్ధరాత్రి నిద్రకు నిద్రపోనివారి వారి సంఖ్య పెరుగుతుంది. బెంగళూరులో 65 శాతం మంది ప్రజలు అర్దరాత్రి వరకు సామాజిక మాధ్యమాల వీక్షణలో మునిగిపోతున్నారనే విషయం ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో బహిర్గతమైంది.  

బెంగళూరు మొదటిస్థానం  
దేశంలోని 10 నగరాల్లో 53 శాతం మంది టీవీ, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, ఫోన్లలో వివిధ షోలు వీక్షిస్తూ లేదా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంతో గడుపుతూ రాత్రి 12 గంటలైనా నిద్రపోవడం లేదని సర్వేలో పేర్కొన్నారు.  
దేశంలోని పది నగరాల్లో ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించే వారి సంఖ్య రోజుకురోజుకూ పెరుగుతోంది. బెంగళూరు తరువాత పూణె 35 శాతం, హైదరాబాద్‌ 38, ఇండోర్‌ 29, విశాఖపట్టణం 36, భువనేశ్వర్‌ 22, కొచ్చిన్‌ 21 అహ్మదాబాద్‌లో28 తదితరాలు ఉన్నాయి.
నగరంలో 65 శాతం మంది సామాజిక మాధ్యమాలను వీక్షిస్తూ అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటారు. 25 శాతం మంది ల్యాప్‌టాప్‌లో పనిచేసుకుంటూ నిద్రించడం వాయిదా వేస్తారు.  
కార్యాలయాల నుంచి ఇంటికి చేరుకునే సమయంలో నిద్ర వస్తుందని 41 శాతం మంది అంటున్నారు. ఉదయం నిద్ర లేచిన అనంతరం కూడా తాజా భావన రావడం లేదని 23 శాతం మంది చెబుతున్నారు. అలాగే నగరాల్లో నిరంతర ప్రయాణాలతో 57 శాతం మంది వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారు.  
పని ఒత్తిడి రాత్రి నిద్ర సమయం చాలా తక్కువగా ఉన్న కారణంగా 37 శాతం మంది విధుల నుంచి తిరిగి వెళ్తూ నిద్రమత్తుకు లోనవుతున్నారు.  

వీకెండ్‌లో మరీ జాస్తి  
సాధారణరోజుల్లో 54 శాతం మంది రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య నిద్రకు ఉపక్రమిస్తారు. కానీ వారాంతం రోజుల్లో ఇదే సమయంలో పడక ఎక్కేవారి సంఖ్య కేవలం 25 శాతమేనని తేలింది. నిద్రలోకి జారుకుని, మళ్లీ ఉదయం నిద్రలేచే మధ్యలో కనీసం 1 నుంచి 2 సార్లు మేలకువ వస్తుందని 68 శాతం మంది తెలిపారు. సామాజిక మాధ్యమాల వినియోగంతో ఏ ప్రమాణంలో ప్రజలు నిద్ర నుంచి దూరమౌతున్నారనే దానిపై సెంచురీ మ్యాట్రెస్‌ సంస్థ నిర్వహించిన స్లీప్‌ సర్వే తెలిపింది. నిద్రపోయే సమయంలో గ్యాడ్జెట్‌లను సాధ్యమైనంత దూరంగా ఉండటం ద్వారా సుఖమైన నిద్రకు ఉపక్రమించవచ్చునని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఉత్తమ్‌మలానీ తెలిపారు. 

మరిన్ని వార్తలు