అభివృద్ధిలో యువత పాత్ర కీలకం

10 Nov, 2013 00:47 IST|Sakshi
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: ఆర్థికంగా భారత్ శరవేగంగా భారత్ అభివృద్ధి చెందుతోందని ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎం రావు పేర్కొన్నారు. త్వరలో మన దేశం మూడో స్థానానికి చేరుకుంటుందని, ఇందులో యువత పాత్ర కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలో డాక్టర్ ఆర్‌ఆర్-డీఆర్‌ఎస్‌ఆర్ వేల్‌టెక్ వర్శిటీ మూడో వార్షికోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి వర్శిటీ వ్యవస్థాపకుడు కల్నల్ డాక్టర్ రంగరాజన్ అధ్యక్షత వహించారు. వైస్ చైర్మన్ శకుంతల అధ్యక్షోపన్యాసం చేశారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎం రావు హాజరయ్యారు. విశిష్ట అతిథిగా అపోలో ఆస్పత్రి కార్డియాలజిస్ట్ సత్యమూర్తి హాజరయ్యారు. సమాజసేవలో జీఎం రావుకు,సత్యమూర్తికి గౌరవ డాక్టరేట్లను వేల్‌టెక్ వర్శిటీ అందజేసింది. 
 
 ఈ సందర్భంగా జీఎం రావు మాట్లాడుతూ ఆర్థికంగా ముందుకు దూసుకుపోతున్న భారత్ రానున్న రోజుల్లో ప్రపంచదేశాలకు సవాల్ విసరనుందన్నారు. ఇప్పటికే దేశంలో దాదాపు 500 మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయని, ఇక్కడున్న మౌలిక సదుపాయాలకు మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ విజయాల్లో యువత పాత్ర కీలకమన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలన్నారు. పాజిటీవ్ దృక్పథంతో విద్యార్థులు ముందుకుసాగాలన్నారు. విజ యం రోజుల్లో రాదని, నిరంతరం కష్టపడాలన్నారు. విద్యార్థులు మానవతాదృక్పథంతో వ్యవహరించాలని, సమాజసేవకు సహకారం అందించాలని డాక్టర్ సత్యమూర్తి సూచించారు.  యూనివర్శిటీ స్థాయిలో ర్యాంకులు సాధించిన  53 మంది విద్యార్థులకు బంగారు పతకాలను, 1110 మందికి డిగ్రీలను  ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్‌కిషోర్‌కుమార్, రంగరాజన్ మహలక్ష్మి, ఛాన్సలర్ బాజ్‌పాయి, పట్టాబిరామన్, వీసీ బీలాసత్యనారాయణతో పాటు విద్యార్థులు హాజరయ్యారు. 
మరిన్ని వార్తలు