బెస్ట్ ఫస్ట్!!

30 Dec, 2013 23:41 IST|Sakshi

 ముంబై: ఆ సంస్థ పేరు ‘బెస్ట్’! ప్రయాణికులను బస్సుల్లో గమ్యస్థానాలకు చేరవేస్తుంటుంది. అయితే ‘బెస్ట్’ అనేది పేరులో మాత్రమేనని, ఆ సంస్థలో పనిచేసే కొందరు ఉద్యోగుల వ్యవహారశైలి ‘వరెస్ట్’గా ఉందంటున్నారు నగరవాసులు. ప్రమాదాలు చేయడంలో, బాధితులకు పరిహారం చెల్లించడం లో, రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిం చడంలో బెస్ట్ సంస్థే మొదటిస్థానంలో నిలుస్తుందని పలువురు విమర్శిస్తున్నారు.  ఇది ఎన్నోసార్లు తేటతెల్లమైంది కూడా. 2010లో ఓ బెస్ట్ బస్ డ్రైవర్ ఉన్మాదిలా మారి వ్యతిరేక దిశలో బస్సు నడిపి రహదారిపై రణరంగమే సృష్టించాడు. 2012-13 మధ్య కాలంలో తొమ్మిదినెలల్లో కూడా బెస్ట్ డ్రైవర్లు 30కి పైగా ప్రమాదాలు చేశారు. దీనికి మరో నాలుగు నెలల ప్రమాదాలు జతకావాల్సి ఉంది.
 
 ఇక బాధితులకు బెస్ట్ సంస్థ చెల్లించిన పరిహారం విషయానికి వస్తే 2010లో ప్రమాదానికి గురైన బాధితులకు రూ.38.89 లక్షలు చెల్లించింది. ఈ విషయమై బెస్ట్ కమిటీ మాజీ సభ్యుడు రవిరాజా మాట్లాడుతూ.. ‘పరిహారాల చెల్లింపుల విషయంలో బెస్ట్ సంస్థ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. అదే ప్రమాదాలు జరగకుండా ఉంటే ఆ సొమ్మును ఉద్యోగుల సంక్షేమానికి ఖర్చు చేయొచ్చ’న్నారు. గతంలో తరచూ ఉన్నతాధికారుల తనిఖీలు ఉండేవని, ఆకస్మిక తనిఖీల్లో డ్రైవర్లు, కండక్టర్ల పరిస్థితి ఏమిటో తెలిసొచ్చేదని, ఇప్పుడదంతా లేకుండా పోయిందన్నారు. అయితే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుండా ఉండేందుకు డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఎంతైనా అవసరమన్నారు.
 
 సామాజిక కార్యకర్త జీఆర్ వోరా మాట్లాడుతూ.. ‘బెస్ట్ డ్రైవర్లు బస్సులను చాలా నిర్లక్ష్యంగా నడుపుతున్నారు. రోడ్డుపై తామే రాజులమనుకుంటున్నారు. సిగ్నల్స్ వద్ద కూడా ఆగడంలేదు. దీంతో పాదచారులు తరచూ ప్రమాదాలబారిన పడుతున్నార’ని ఆరోపించారు. ఈ విషయమై బెస్ట్ ప్రయాణికుల హక్కుల కార్యకర్త ఇర్ఫాన్ మచివాలా మాట్లాడుతూ.. ‘విధులు సక్రమంగా నిర్వర్తించే డ్రైవర్లకు ఎటువంటి ప్రోత్సాహకాలను ఆ సంస్థ ఇవ్వడంలేదు. దీంతో ఎంత కష్టపడి పనిచేసినా, చేయకపోయినా అంతే వేతనం లభిస్తుందనే ఆలోచనతో డ్రైవర్లు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నార’న్నారు. బెస్ట్ అధికార ప్రతినిధి ఏఎస్ తంబోలి మాట్లాడుతూ.. ‘బెస్ట్ డ్రైవర్ల రికార్డులను పరిశీలించాలని నిర్ణయించాం. గత కొన్నేళ్లుగా కనీసం ఒక్క ప్రమాదానికి  కూడా బాధ్యులు కాని డ్రైవర్లకు ప్రోత్సాహం అందజేయాలని నిర్ణయించాం. ఇది మిగతా డ్రైవర్లకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నామ’న్నారు.
 

మరిన్ని వార్తలు