తహశీల్దార్‌పై భూమా వర్గీయుల దాడి

4 Oct, 2016 06:56 IST|Sakshi
దాడిలో గాయపడిన తహశీల్దార్‌ అంజనేయులు
– భూములు ఆన్‌లైన్‌ చేయలేదని టీడీపీ వర్గీయులు నిలదీత 
– వీఆర్వోను కలవాలని తహశీల్దార్‌ సూచన
– మాటామాటా పెరిగి పేపర్‌వెయిట్‌తో దాడి చేసిన వైనం
 
చాగలమర్రి:  అధికార పార్టీ నేతల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. ఓ వైపు అధికార యంత్రాంగాన్ని భయబ్రాంతులకు గురి చేస్తూ.. వారి ఆకృత్యాలను ఎదురించే ప్రతిపక్ష పార్టీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తూ బరితెగిస్తున్నారు. అధికారులపై దాడులు చేయడం తమకు కొత్తమి కాదన్నట్లు తెలుగు దేశం నాయకులు (భూమా వర్గీయులు) తాజాగా చాగలమర్రి తహశీల్దార్‌పై దాడి చేశారు.

మండలంలోని చక్రవర్తులపల్లె, గొడిగెనూరు గ్రామాలకు చెందిన భూమా వర్గానికి చెందిన కొందరు తమ పొలాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కొన్నాళ్లుగా తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో చక్రవర్తులపల్లె గ్రామానికి చెందిన నరసింహారెడ్డితో పాటు మరో ముగ్గురు రైతులు తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. తమ భూములను ఆన్‌లైన్‌లో ఎందుకు నమోదు చేయడం లేదని తహశీల్దార్‌ ఆంజనేయులను నిలదీశారు. పొలాలకు సంబంధించిన సమస్యపై వీఆర్వోను కలవాలని సూచించారు. తమ భూములు చిన్నబోధనం గ్రామ పరిధిలో ఉండటంతో ఆ వీఆర్వో ప్రస్తుతం మారి పోయాడని చెప్పారు.

వెంటనే నరసింహారెడ్డి బదిలీపై వెళ్లిన వీఆర్వోతో ఫోన్‌లో మాట్లాడుతుండగా బయటకు వెళ్లి మాట్లాడమని తహశీల్దార్‌ సూచించాడు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. టేబుల్‌పై ఉన్న పేపర్‌ వెయిట్‌తో తహశీల్దార్‌ తలపై నరసింహారెడ్డి దాడి చేశాడు. కార్యాలయంలో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. వెంటనే అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు. గాయపడిన తహశీల్దార్‌ను ఆసుపత్రికి తరలించారు. జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు బాబులాల్, వీఆర్‌ఓలు, తలారీలు, డీలర్లు, వివిధ శాఖల అధికారులు ఆసుపత్రికి చేరుకొని తహశీల్దార్‌ను పరామర్శించారు. తహశీల్దార్‌ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మొహన్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    
 
మరిన్ని వార్తలు