కృష్ణగిరిలో విజయ్‌ ఫ్యాన్స్‌ విధ‍్వంసం

25 Oct, 2019 09:39 IST|Sakshi

అభిమానం హద్దు మీరింది. బిగిల్‌ చిత్రం విడుదల సందర్భంగా విజయ్‌ అభిమానులు విధ్వంసానికి దిగారు. ముందుగా సినిమా ప్రదర్శించలేదని థియేటర్‌లోని ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. సీసీ టీవీలను పగులకొట్టారు. దీంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులపై లాఠీచార్జ్‌ చేశారు. 

సాక్షి ప్రతినిధి, చెన్నై:  విజయ్‌ హీరోగా నటించిన బిగిల్‌ చిత్రం విడుదల విధ్వంసానికి, లాఠీ చార్జ్‌కి దారితీసింది. విజయ్‌ అభిమానుల ఆగ్రహానికి అంగళ్లతోపాటూ పోలీసు వాహనం కూడా అగ్నికి ఆహుతైంది. నలుగురు పోలీసులు గాయపడగా, పలువురు అభిమానులు కటకటాల పాలయ్యారు. తమిళ సినీ పరిశ్రమలో రజనీకాంత్‌ తరువాత అంతటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్నట్లుగా ప్రచారంలో ఉన్న హీరో విజయ్‌. ఆయన సినిమా అంటే అభిమానులకు పండుగే. శుక్రవారం విజయ్‌ చిత్రం విడుదల కావడంతో అభిమానుల్లో ఆనందం కట్టలుతెంచుకుంది. దర్శకుడు అట్లీ, విజయ్, నయనతార కాంబినేషన్‌ కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శన కోసం అభిమానులు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు. అయితే గురువారం రాత్రి ప్రభుత్వం అకస్మాత్తుగా తొలిరోజు మాత్రం ప్రత్యేక ప్రదర్శనకు అనుమతి ఇవ్వడంతో ఒకింత శాంతించారు. శుక్రవారం తెల్లవారుజామున రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ప్రత్యేక షో ప్రదర్శితమైంది.  

కృష్ణగిరిలో రెండు థియేటర్లలో బిగిల్‌ ప్రదర్శనకు సిద్ధంకాగా, అభిమానుల కోసం శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని యాజమాన్యం ప్రకటించింది.  దీంతో గురువారం అర్ధరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకోవడం ప్రారంభించారు. క్రమేణా ఈ సంఖ్య మరింత పెరిగిపోవడంతో తోపులాట, తొక్కిసలాట మొదలైంది. వెంటనే షో వేయాలని అభిమానులు కేకలు వేశారు. అయితే 3 గంటల తరువాత మాత్రమే ప్రత్యేక ప్రదర్శన వేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయని యాజమాన్యం వారికి తెలిపింది. 

దీంతో అసహనానికి లోనైన అభిమానులు విధ్వంస చర్యలు ప్రారంభించారు. థియేటర్‌లోకి జొరబడి కుర్చీలను ధ్వంసం చేశారు. రోడ్డు పక్కన ఉన్న అంగళ్లను, ప్రకటన బోర్డులను తగులబెట్టారు. థియేటర్‌కు అమర్చి ఉన్న సీసీటీవీ కెమెరాలను పగులగొట్టారు. అప్పటికే గస్తీ విధుల్లో ఉన్న పోలీసులు అభిమానులను చెదరగొట్టడం ప్రారంభించగా గందరగోళం నెలకొంది. పోలీసులపై అభిమానులు దాడికి దిగారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. అభిమానుల దాడులు అదుపు తప్పడంతో పోలీసులు కంట్రోలు రూముకు ఫోన్‌ చేయడంతో ప్రత్యేక పోలీసు దళం రంగప్రవేశం చేసి లాఠీచార్జ్‌కి దిగారు. ఈ గొడవల్లో నలుగురు  పోలీసులకు, కొందరు అభిమానులకు గాయాలయ్యాయి. 

పోలీసుల అదుపులో 37 మంది.. 
ఆస్తులను ధ్వంసం చేసిన వారిలో 37 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణగిరిలోని రెండు థియేటర్ల ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి శుక్రవారం తెల్లవారుజాము 5 గంటలకు అభిమానుల కోసం ప్రత్యేక షో వేశారు. ఇదిలా  ఉండగా, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వందలాది థియేటర్లలో యధావిధిగా విడులైంది. విజయ్‌ ఫ్లెక్సీలకు అభిమానులు పాలాభిషేకం చేశారు. 

నకిలీ టోకెన్లు.. 
ప్రత్యేక షో చూసేందుకు నకిలీ టోకెన్లతో వచ్చిన ముగ్గురు అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూత్తుకూడిలో రెండు థియేటర్లలో బిగిల్‌ విడుదలైంది. విజయ్‌ అభిమానుల కోసం ప్రత్యేక ప్రదర్శన కోసం ఏర్పాట్లు జరిగాయి. ఇందుకోసం నగదు మొత్తాన్ని యాజమాన్యానికి చెల్లించారు. ఆ తరువాత తొలి ప్రదర్శనకు టిక్కెట్ల పంపిణీకై టోకన్లను పంపిణీ చేశారు. అయితే కొందరు అభిమాలను చేతుల్లోని టోకన్లపై అభిమాన సంఘం నేతలకు అనుమానం రావడంతో తనిఖీ చేయగా అవి నకిలీ టోకన్లని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో రాజన్‌ (28), మోహన్‌బాబు (26), ఆనంద్‌ (30)లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నకిలీ టోకన్లను ముద్రించిన తిరునెల్వేలీకి చెందిన ఒక వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

కాగా కోర్టులు, కేసులు, ఆరోపణలు, వ్యతిరేకతలను అధిగమించి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగిల్‌ చిత్రం తెలుగులో ‘విజిల్‌’ గా విడుదలైంది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేశాడు. మరోవైపు సినిమా పాజిటిల్‌ టాక్‌ సొంతం చేసుకుంది. విజయ్‌ మాస్‌ పాత్రలో ఇరగదీశాడంటూ, సెకండ్‌ హాఫ్‌లో సెంటిమెంట్‌ ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కనెక్ట్‌ అయ్యాడంటూ  అభిమానులు ట్విట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు