ఇక డుమ్మాలకు చెక్!

26 Sep, 2013 03:43 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దశలవారీ బయోమెట్రిక్ అటెండెన్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్ర సచివాలయంతో పాటు కొన్ని కార్యాలయాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నవంబరు ఒకటో తేది నుంచి నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దీనిని ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పని వేళల్లో ఉద్యోగులు విధిగా కార్యాలయాల్లో ఉండేట్లు చూడడమే దీని ఉద్దేశం. రాజధానిలో దీనిని ప్రవేశ పెట్టడం పూర్తయిన తర్వాత దశల వారీ జిల్లా, తాలూకా స్థాయి కార్యాలయాలకు కూడా దీనిని విస్తరిస్తారు.

ఈ కొత్త అటెండెన్స్ వ్యవస్థను కల్పించుకోవడానికి ఆయా శాఖలే ఖర్చును భరించుకోవాలని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్ల కిందట సచివాలయంలో ఈ వ్యవస్థను ప్రవేశ పెట్టినప్పటి నుంచి ఉద్యోగుల హాజరు శాతం గణనీయంగా మెరుగు పడింది.

ఉద్యోగుల గైర్హాజరుపై ఫిర్యాదులు తగ్గాయి. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఉదయం ఆలస్యంగా రావడం, సాయంత్రం త్వరగా వెళ్లిపోవ డం సర్వ సాధారణం. కొందరు ఉద్యోగులు మరుసటి రోజు సెలవు తీసుకోవాలనుకుంటే, ముందు రోజే హాజరు పట్టీలో సంతకం చేసి వెళుతుంటారు. బయోమెట్రిక్ అటెండెన్స్ వల్ల ఇలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు.
 

మరిన్ని వార్తలు