ఎంతమాట..ఎంతమాట..!

8 Feb, 2018 17:58 IST|Sakshi

 అధికార పార్టీలో ఉంటూ అధినేతపై  విమర్శలు

 బీజేడీ పార్టీ, ముఖ్యమంత్రిపై  వ్యతిరేక వ్యాఖ్యలు 

 విరుచుకుపడిన  హేమ గొమాంగో 

రాయగడ:  ఒడిశా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ గిరిధర్‌గొమాంగో సతీమణి హేమగొమాంగో అధికార బీజేడీ పార్టీలో ఉంటూ అదే పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆమె బీజేడీలో ఉన్నప్పటికీ పార్టీలో ఆమెకు ఎటువంటి ప్రాధాన్యం ఇంతవరకు కల్పించలేదు. హేమగొమాం గో ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో విఫలం కాగా పార్టీలో కూడా ఆమె స్థితిని నిలబెట్టుకోలేక పోయారు.  పార్టీ కార్యకర్తలు కూడా నేటివరకు ఆమెకు దూరంగా ఉండేవారు. ఈ సమయంలో హేమగొమాంగో తన మద్దతు దారులతో కలిసి గుణుపురంలో  బుధవారం   విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీజేడీ పార్టీని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ అవినీతి పాలనపై దుమ్మెత్తి పోశారు. ఈ ఘటన హఠాత్తుగా జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.


అవినీతి మయమైన పాలన


సమావేశంలో హేమగొమాంగో మాట్లాడుతూ బీజేడీ ముఖ్యమంత్రి పాలన అవినీతి మయంగా మారిందని పార్టీ కి సంబంధించి విభిన్న అభివృద్ధి పనులు కోరుతూ ఇచ్చే వినతిపత్రాలు బుట్ట దాఖలవుతున్నాయని ఆరోపించారు.   సీఎం నవీన్‌పట్నాయక్‌ తన మాట¯లను వినిపించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి లభించడం లేదని, పేరుకే ముఖ్యమంత్రి అయినా కార్యక్రమాలను ఐఏఎస్‌ అధికారి పాండ్యన్‌ చూస్తున్నారని, పాండ్యన్‌కు  భారీగా డబ్బు ముట్టజెప్పనిదే పనులు జరగడం లేదని తీవ్రస్థాయిలో ఆరోపించారు.  అధికార బీజేడీ పార్టీ  రాయగడ జిల్లా  నాయకుడు భగీరథి మండంగి హత్య కేసు, టికిరిలో ఉపాధ్యాయురాలు ఈతిశ్రీప్రధాన్‌ హత్యకేసు, కుందులిలో ఆశ్రమ విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి, ఆత్మహత్య కేసులో నేటికీ బాధితుల కుటుంబాలకు న్యాయం జరగలేదని విమర్శించారు.  


పెరిగిపోయిన దాదాగిరి


బీజేడీ పార్టీ అవినీతి కూపంలా తయారైందని, పద్మపూర్‌లో ప్రజలు తాగునీటికి అనేక ఇబ్బందులు పడుతున్నా ఏ సమస్యను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని  ఆరోపించారు. ప్రస్తుతం బీజేడీలో దాదాగిరి, గుండాగిరి పెరిగిపోయింది. బీజేడీని వ్యతిరేకించే వారిని హత్య చేయడం, లేదా తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌లు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు.  ముఖ్యమంత్రి  నవీన్‌పట్నాయక్‌ను రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించి గద్దె దించాలని,   రాయగడ జిల్లాలో బీజేడీ వ్యతిరేక పోరాటాలకు తనకు  మద్దతుదారులు, ప్రజలు సహకరించాలని కోరారు. అయితే ప్రస్తుతం రాయగడ జిల్లాలో ఉల్క కుటుంబాల రాజకీయాలకు గొమాంగోల రాజకీయాలకు తెరపడింది.  ప్రజల మద్దతు కానీ ఏ పార్టీ మద్దతు కానీ వారికి లేదు.  ఇప్పటికే తెరమరుగైన వారు ఎన్నికల ముందుల ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేడీ పార్టీలో ఆమె పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు