ప్రచారానికి బీజేపీ సీనియర్లు దూరం!

12 Aug, 2015 02:26 IST|Sakshi
ప్రచారానికి బీజేపీ సీనియర్లు దూరం!

బెంగళూరు :  వరుసగా రెండోసారి బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే కమల నాథుల వ్యూహాలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. సీనియర్ నాయకులతో పాటు బెంగళూరు నగరాన్నే కాక రాష్ట్ర రాజకీయాలను సైతం శాసించే సముదాయ వర్గాలకు చెందిన ఇద్దరు నాయకులు ప్రచార పర్వంలో పాల్గనబోమని చెప్పడమే ఇందుకు కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.అశోక్‌కు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సీనియర్ నాయకుల సూచనలను సైతం లెక్కచేయకుండా అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరు నగరంలో బీజేపీ పటిష్టతకు కృషి చేసిన కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్‌తోపాటు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న వీరశైవ సముదాయ నాయకుడైన బి.ఎస్.యడ్యూరప్ప సూచించిన ఒకరిద్దరు అభ్యర్థులకు కూడా టికెట్టు ఇవ్వక పోవడం ఆ పార్టీ సీనియర్ నేతలకు మింగుడు పడటం లేదు.

దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న వారు ప్రచారంలో పాల్గొనబోమని ఇప్పటికే తేల్చిచెప్పినట్టు సమాచారం. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండటం వల్ల బీబీఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కుదరదని అనంతకుమార్‌తోపాటు యడ్యూరప్ప సైతం ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషికి ఇప్పటికే తేల్చిచెప్పినట్టు సమాచారం. ఒకవేళ కేంద్ర స్థాయి నాయకులు కలుగజేసుకుంటే ఎన్నికల ప్రచారంలోని చివరి ఘట్టంలో ఒకటి లేదా రెండు రోజులు అలా వచ్చి ఇలా వెళ్లిపోవాలని వీరిద్దరూ భావిస్తున్నట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ ఓటు బ్యాంకును ప్రభావితం చేయగల నాయకులు ఎన్నికల ప్రచారానికి గైర్హాజరవడమే కాకుండా పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన కొంతమంది కార్పొరేటర్ అభ్యర్థులను ఓడించడానికి ప్రయత్నించడం బీబీఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయంపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
 
 

మరిన్ని వార్తలు