ముందుగానే బీజేపీ అభ్యర్థుల ఖరారు

1 Aug, 2013 00:09 IST|Sakshi

నగరంలో 15 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న  బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సరికొత్త  వ్యూహాన్ని అనుసరించనుంది. అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ముందుగానే ప్రకటించడంతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో భారీ బహిరంగ సభ నిర్వహిం చడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం వల్ల  టికెట్లు రాలేదన్న ఆగ్రహంతో పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసే నేతలు కూడా నెమ్మదిగా మనసు మార్చుకుంటారని భావిస్తోంది.  
 
 ఇంతవరకు ఢిల్లీ బీజేపీ సరిగ్గా ఎన్నికల  ఆఖరి నిమిషంలో అభ్యర్థుల పేర్లను ప్రకటించేది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాన్ని బట్టి బీజేపీ తన ప్రణాళికను రచించేది. కానీ ఈసారి ఎన్నికలలో బీజేపీ వ్యూహాన్ని మారుస్తోంది. ఆగస్టు ఆఖరు వరకు అభ్యర్థులను ఎంపిక చేసి సెప్టెంబర్ మొదటివారంలో ప్రకటించేలా కసరత్తును చేస్తోంది. పదిపదిహేను కీలక సీట్లలో అభ్యర్థుల పేర్లను ఆలస్యంగా ప్రకటించినప్పటికీ 50 నుంచి 60 సీట్లలో అభ్యర్థుల పేర్లను ముందే ప్రకటించవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.  అయితే  గెలిచే అవకాశాలున్న సీట్ల కోసం బీజేపీ సీనియర్ నేతలే పోటీపడుతున్నట్లు సమాచారం. గ్రేటర్ కైలాష్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న  విజయ్‌కుమార్ మల్హోత్రా ఆ స్థానంలో తన కుమారుడ్ని నిలబెట్టాలనుకుంటున్నారని అంటున్నారు.  ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే తానే ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని  భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే  ఆర్తీ మెహ్రా కూడా ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. మాలవీయనగర్ కంటే గ్రేటర్ కైలాష్ సురక్షితమైన సీటు  కావడంతో అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆర్తీ మెహ్రా  ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. విజయ్ జోలీ, శిఖా రాయ్‌లతో పాటు ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీ అయిన  అకాలీదళ్ నేత మంజీత్ సింగ్ జీకే కూడా ఈ సీటు నుంచి పోటీచేయడానికి మక్కువ చూపుతున్నారు.

మరిన్ని వార్తలు