కమలం చూపు.. రామన్న వైపు

16 Mar, 2016 02:21 IST|Sakshi
కమలం చూపు.. రామన్న వైపు

 పీఎంకే అయినా కలసి వస్తుందా? అన్న ప్రయత్నాల్ని కమలనాథులు చేపట్టారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసుతో రహస్యంగా మంతనాల్లో కమలం పెద్దలు మునిగినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తమకు పెద్ద పీట వేసే రీతిలో ఈ మంతనాలు సాగుతుండడంతో నిర్ణయంపై పీఎంకే వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం.  
 
 సాక్షి, చెన్నై : డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయశక్తిగా అవతరించాలని కాంక్షించిన కమలంకు అడుగడుగునా అడ్డంకులే. లోక్ సభ ఎన్నికల్లో తరహాలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ చుట్టూ పార్టీలు తిరుగుతాయని ఆశించి తప్పులో కాలేశారు. విశ్వ ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో , చివరకు ఒంటరిగా మిగలాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది. డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ తిరిగి, ప్రస్తుతం పీఎంకే వైపు దృష్టి పెట్టే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే , తమ సీఎం అభ్యర్థిగా అన్భుమణి పేరును పీఎంకే ప్రకటించి ఉండడంతో, వారితో మంతనాల్లో మునిగిన పక్షంలో ఎక్కడ విజయకాంత్ తమకు దూరం అవుతారోనన్న బెంగ తొలుత కమలనాథుల్లో ఉండేది.
 
  అయితే, తాను ఒంటరి అని విజయకాంత్ ప్రకటించి ఉండడంతో, ఇక ధైర్యంగా పీఎంకేతో మంతనాలకు సిద్ధ పడ్డట్టున్నారు. ఇది వరకే ఓ మారు పీఎంకేతో కమలం పెద్దలు ఫోన్లో సంప్రదింపులు జరిపినట్టు, ఈ సమయంలో కొన్ని మెళికల్ని రాందాసు పెట్టినట్టుగా సంకేతాలు ఉన్నాయి. ఇందులో అన్భుమణిని సీఎం అభ్యర్థిగా అంగీకరించాలన్న పీఎంకే డిమాండ్‌ను ఇది వరకు విజయకాంత్ కోసం పక్కన పెట్టి కమలనాథులు, తాజాగా పరిశీలనకు నిర్ణయించినట్టు తెలిసింది. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కోవడం కన్నా, పీఎంకేను అక్కున చేర్చుకుని, ఆ పార్టీ కూటమి వెన్నంటి ఉన్న కొన్ని సామాజిక వర్గాల చిన్న పార్టీలను కలుపుకుంటే, తమ బలం పెరిగినట్టు అవుతుందన్న భావనలో కమలనాథులు ఉన్నట్టు సమాచారం.  
 
 ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ర్ట ఎన్నికల ఇన్‌చార్జ్ , కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మంతనాలకు సిద్ధ పడ్డట్టు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాందాసు, అన్భుమణిలతో ఆయన ఫోన్లో మాట్లాడినట్టు చెబుతున్నాయి. పీఎంకే తమ ముందు ఉంచిన డిమాండ్లను పరిశీలిస్తున్నామని, త్వరలో చెన్నైలోగానీ, దిండివనంలోగానీ సంప్రదింపులకు తగ్గ కార్యచరణకు నిర్ణయించనట్టు పేర్కొంటున్నాయి. అయితే, బీజేపీ తమతో కలసి వచ్చే ప్రయత్నాల్ని వేగవంతం చేసిన దృష్ట్యా, తదుపరి అడుగుల దిశగా రాందాసు కసరత్తుల్లో ఉన్నట్టు సమాచారం.
 
 అందుకే బీజేపీ తమతో పొత్తు ప్రయత్నాలు చేసినట్టు మీడియా ముందు రాందాసు అంగీకరించి ఉండడం గమనార్హం. బీజేపీ తమతో పొత్తు ప్రయత్నాల్ని వేగవంతం చేయడంతో, అన్భుమణి సైతం సర్వం పెంచి ఉండడం విశేషం. డీఎంకే, అన్నాడీఎంకేలకు పతనం ఖాయం అని, పీఎంకే బలం పెరిగిందని, తమకు లభిస్తున్న ప్రజాదరణను చూసి తమ వైపు చూసే వాళ్లు పెరుగుతున్నారని మదురైలో   వ్యాఖ్యానించడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు