సొంత గూటికి యడ్డి

10 Jan, 2014 02:11 IST|Sakshi
  • యడ్డికి బీజేపీ తీర్థం  
  •  పూర్తయిన లాంఛనం
  •  శోభా, రేణుకాచార్య, సీఎం ఉదాసీ, మరో ఇద్దరు ఎమ్మెల్యేల చేరిక
  •  
    సాక్షి, బెంగళూరు :  రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప గురువారం లాంఛనంగా బీజేపీలో చేరారు. ఇక్కడి మల్లేశ్వరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం జగన్నాథ భవన్‌కు ఆయనతో పాటు ఎమ్మెల్యేలు యూబీ. బనకార, విశ్వనాథ పాటిల్, సుమారు 300 మంది కార్యకర్తలు ఊరేగింపుగా వచ్చారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ అధ్యక్షుడు కేఎస్. ఈశ్వరప్ప యడ్యూరప్పకు ఎదురు వెళ్లి మెడలో పూలమాల వేసి పార్టీలోకి ఆహ్వానించారు.  అనంతరం పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చారు. యడ్యూరప్పతో పాటు ఎమ్మెల్యేలు  బనకార, విశ్వనాథ పాటిల్  రూ.105 చెల్లించి సభ్యత్వాన్ని తీసుకున్నారు.

    అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ .. అధికార వ్యామోహంతో తాను తిరిగి బీజేపీలోకి రాలేదన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని చేయాలనేదే తన లక్ష్యమన్నారు. బీజేపీని వదిలి తప్పు చేశానన్నారు. ఇకపై అలాంటి తప్పులు జరగబోవని సంజాయిషీ ఇచ్చారు. బీజేపీ నాయకులు  మనసులో ఏమీ పెట్టుకోకుండా కేజేపీ నాయకులకు, కార్యకర్తలకు వారి సామర్థ్యానికి తగిన విధంగా పార్టీ పదవులు ఇవ్వాలని సూచించారు.

    కాగా మాజీ మంత్రులు శోభా కరంద్లాజె, రేణుకాచార్య, సీఎం. ఉదాసీ తదితరులు కూడా ఇదే సందర్భంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనంతకుమార్, మాజీ ముఖ్యమంత్రులు సదానందగౌడ, జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు ఆర్. అశోక్, కేఎస్. ఈశ్వరప్ప, ఎమ్మెల్సీ తార తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు