మోడీ వైపే మొగ్గు

13 Sep, 2013 03:47 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని అ    భ్యర్థిగా ప్రకటించే విషయమై బీజేపీలో అంతర్యుద్ధం కొనసాగుతుండగా, ఆ పార్టీ కర్ణాటక శాఖ టోకుగా మోడీ వైపే నిలుస్తోంది. అగ్ర నేత ఎల్‌కే. అద్వానీ మానస పుత్రుడుగా పేరొందిన బెంగళూరు దక్షిణ ఎంపీ అనంత కుమార్ వ్యవహార శైలి పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న రాష్ట్ర బీజేపీ నాయకులందరూ మోడీకి ముక్త కంఠంతో మద్దతు పలుకుతున్నారు. అద్వానీ అండతో రాష్ట్ర శాఖలో అనంత కుమార్ ఆడింది ఆటగా సాగుతూ వచ్చింది.

మోడీ విషయంలో బీజేపీ నిక్కచ్చిగా ఉండడం, అద్వానీ పార్టీ నుంచి వెళ్లిపోయినా ఫర్వాలేదనే ధోరణి కనిపిస్తుండడంతో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పార్టీలో పునరాగమనానికి మార్గం సుగమమైంది. తనపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అద్వానీ పట్టుదల వల్లే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని యడ్యూరప్ప అప్పటి నుంచే ఆగ్రహంతో ఉన్నారు, పదవి నుంచి తప్పుకున్నాక బెంగళూరులో అద్వానీ సభను ఏర్పాటు చేసినప్పుడు యడ్యూరప్ప విధేయ ఎమ్మెల్యేలు అటు వైపు చూడలేదు. దీంతో వారిద్దరి మధ్య అంతరం బాగా పెరిగిపోయంది.

బీజేపీ నుంచి యడ్యూరప్ప నిష్ర్కమించడానికి అద్వానీ ప్రధాన కారణమని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. మోడీ తొలి నుంచీ యడ్యూరప్ప పట్ల కాసింత మెతక ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. బీజేపీ నుంచి ఆయన వెళ్లిపోకుండా చివరి వరకు ప్రయత్నించారు. శాసన సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన అనంతరం యడ్యూరప్ప అవసరాన్ని రాష్ట్ర బీజేపీ నాయకులు గుర్తించారు. అందుకనే పాత పగలను కూడా మరిచి మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ, యడ్యూరప్పను పార్టీలోకి తీసుకు రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల అహ్మదాబాద్‌కు వెళ్లి ఈ విషయమై మోడీతో కూడా చర్చించారు.

పార్టీలో ఆయన చేరిక ఇక లాంఛనమేనని తెలుస్తోంది. మరో వైపు ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో నగరంలో గురువారం జరగాల్సిన పార్టీ కోర్ కమిటీ సమావేశం రద్దయింది. పార్టీ అగ్రనేత ఎం. వెంకయ్య నాయుడు ఈ సమావేశంలో పాల్గొనడానికి బుధవారం సాయంత్రమే నగరానికి వచ్చారు. అయితే గురువారం ఉదయం పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ నుంచి ఫోన్ రావడంతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిపోయారు. వచ్చే అక్టోబరులో నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై ఈ సమావేశంలో చర్చించాల్సి ఉంది. నాలుగు బహిరంగ సభల్లో ప్రసంగించడానికి మోడీ ఇదివరకే అంగీకరించారు.

చివరి నిమిషంలో సమావేశాన్ని రద్దు చేయడంపై సదానంద గౌడ ప్రభృతులు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషిపై మండి పడుతున్నారు. అనంత కుమార్‌కు సన్నిహితుడైన జోషి ఆయన సూచనల మేరకే సమావేశాన్ని రద్దు చేశారని సదానంద గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కేఎస్. ఈశ్వరప్పకు అనంత కుమార్ అంటేనే పడదు. సమావేశం రద్దుపై నాయకుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకున్నట్లు తెలిసింది.
 

మరిన్ని వార్తలు