బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

29 Mar, 2017 09:01 IST|Sakshi

బెంగళూరు:  ‘ముస్లింలు మా పార్టీ కార్యాలయంలో చెత్త ఊడిస్తే వారికి పార్టీ టికెట్‌ ఇస్తాం’ అంటూ కర్ణాటక శాసనమండలిలో బీజేపీ పక్ష నేత కేఎస్‌ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా మంగళవారం జరిగిన కార్యకలాపాల సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ హర్షద్‌ రిజ్వాన్‌ మీ పార్టీలో ముస్లింలకు ఎన్ని టికెట్‌లు ఇచ్చారంటూ బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఈ సందర్భంలో కె.ఎస్‌.ఈశ్వరప్ప సమాధానమిస్తూ.. మా పార్టీ కార్యాలయంలో చెత్త ఊడిస్తే ముస్లింలకు టికెట్‌లు ఇస్తామని చెప్పడంతో కాంగ్రెస్‌ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

దీంతో సర్దుకున్న కె.ఎస్‌.ఈశ్వరప్ప మైనారిటీ వర్గానికి చెందిన అబ్దుల్‌ కలామ్‌ను రాష్ట్రపతి చేసింది ఎవరు? జార్జ్‌ ఫెర్నాండెజ్‌ను కేంద్ర మంత్రిని చేసింది ఎవరు? అంటూ తన వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. దీంతో సీఎం సిద్ధరామయ్య కలగజేసుకుంటూ బీజేపీ నేతలు ముందు నుంచి మైనారిటీ వర్గాలకు వ్యతిరేకులే అన్నారు. ఈశ్వరప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదు. ఈ పదాలను వెంటనే తొలగించండి అని చెప్పారు. దీంతో కె.ఎస్‌.ఈశ్వరప్ప మాట్లాడుతూ.. పార్టీ కార్యాలయంలో చెత్త ఊడ్చడం అంటే పార్టీ కోసం శ్రమించడమని అర్ధం. పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం, బ్యానర్‌లు కట్టడం వంటివి. అంతేకానీ నా వ్యాఖ్యలకు విపరీతమైన అర్థాలు కల్పించవద్దని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు